నల్లగొండ : ఎక్సైజ్ నిబంధనలకు తోడు నియోజకవర్గ ఎమ్మెల్యే సొంత నిబంధనలు ఖరారు చేయడం మునుగోడు జిల్లా నియోజకవర్గంలో సంచలనంగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ( MLA Rajagopal Reddy) నిబంధనల పేరిట జారీ చేసిన అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు, చండూరు, గట్టుప్పల్, నాంపల్లి, మర్రిగూడ, నాంపల్లి, చౌటుప్పల్, సంస్థన్ నారాయణపురం మండలాలలో వైన్ షాప్స్ (Wine Shops ) టెండర్స్ వేసే ఆశావహులు టెండర్లు వేయాలంటే షరతులు పాటించాలని హుకుం జారీ చేశారు. షరతులు పాటించని వారు టెండర్స్ వేయవద్దని,వైన్ షాప్స్ నిర్వాహకులు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలని సూచించారు .
మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలని, ఇతర మండలానికి చెందిన వ్యక్తులు టెండర్లు వేయవద్దని స్పష్టం చేశారు. వైన్ షాప్లు ఊరి బయట మాత్రమే పెట్టాలని,వైన్ షాప్ కు అనుబంధంగా పర్మిట్ రూమ్ ఉండవద్దన్నారు. ముఖ్యంగా బెల్ట్ షాపులకు మద్యం అమ్మవద్దని , లాటరీ విధానంలో వైన్స్ షాప్ లు దక్కించుకున్న ఓనర్స్ సిండికేట్ కాకూడదని పేర్కొన్నారు.ఈ రూల్స్ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, బెల్టు షాప్ల నిర్మూలన, మహిళల సాధికారతే తన ఉద్దేశమని పేర్కొన్నారు.