Jai Hanuman | ‘కాంతార చాప్టర్ 1’తో మళ్లీ ఒక్కసారి బాక్సాఫీస్‌ను శాసించిన కన్నడ స్టార్ రిషబ్ శెట్టి, ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘జై హనుమాన్’ గురించి చేసిన కామెంట్స్‌తో హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే, రిషబ్ చేసిన తాజా వ్యాఖ్యలతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ‘కాంతార చాప్టర్ 1’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి, తన తదుపరి ప్రాజెక్టుల గురించి స్పందించారు. “చాప్టర్ 1 తర్వాత నేను చేస్తున్న సినిమా ‘జై హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా 2026 జనవరిలో సెట్స్‌పైకి వెళ్తుంది. ఆ తర్వాత నా డైరెక్షన్లో మరో సినిమా ఉంటుంది, అది రెండేళ్లలో వస్తుంది” అని ఆయన వెల్లడించారు.
ఈ కామెంట్స్ విన్న తర్వాత అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇప్పటికీ షూటింగ్ ప్రారంభం కాలేదా? 2026 జనవరి అంటే సినిమా రిలీజ్‌కు ఇంకెన్నాళ్లు? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గతంలో ‘జై హనుమాన్’ సినిమా నుంచి రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు షూటింగ్ స్టార్ట్ అయిందన్న భావన అభిమానుల్లో ఏర్పడింది. కానీ ఆ ఫొటో కేవలం ఫోటోషూట్ మాత్రమేనని, అసలు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే క్లారిటీ ఇప్పుడే వచ్చింది. 2026 జనవరిలో సెట్స్ పైకి వెళ్తే, పోస్ట్-ప్రొడక్షన్, గ్రాఫిక్స్, ప్రమోషన్స్ అన్నింటినీ కలుపుకుంటే ఈ సినిమా విడుదలకు కనీసం 2027 వరకు వేచి చూడాల్సి రావచ్చు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే గ్యాప్‌లో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించే మరో ప్రాజెక్ట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం, ‘హనుమాన్’ సినిమా సీక్వెల్ కావడంతో ఇప్పటికే భారీ బజ్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించిన ‘హనుమాన్’ తర్వాత ప్రేక్షకులలో ‘జై హనుమాన్’పై భారీ అంచనాలున్నాయి. ఇక రిషబ్ శెట్టి లాంటి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ నటుడు ఇందులో ప్రధాన పాత్ర పోషించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది.ఇప్పటికే హైప్లో ఉన్న ‘జై హనుమాన్’ గురించి రిషబ్ తాజా వ్యాఖ్యలు కొంతమంది అభిమానులకు నిరాశే కలిగించాయి. అయితే, బలమైన స్క్రిప్ట్, విజన్‌తో ముందుకెళ్తున్న ప్రాజెక్ట్ కావడంతో, ఈ సినిమా కోసం ఎన్ని రోజులు అయిన వెయిట్ చేస్తామంటున్నారు.