సూర్యాపేట, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీల్లో మరింత పౌష్టికాహారం అందిస్తాం.. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ఎగ్ బిర్యానీ పెడతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటన ఒక్క రోజు మురిపెమే అయ్యింది. అమ్మ మాట.. అంగన్వాడీ బాట పేరిట జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జూన్ 11న అధికారులు, పాలకులు పలు చోట్ల ఎగ్ బిర్యానీ వడ్డించి షో చేసి ఆర్భాటంగా ప్రారంభించారు. బిర్యానీపై ప్రభుత్వం ప్రకటన చేసిందిగానీ ఎలాంటి గైడ్‌లైన్స్ విడుదల చేయకపోవడం… అదనంగా నిధులు కేటాయించకపోవడంతో ప్రారంభించిన రోజే చివరి రోజైంది.
దేశంలోనే ఏ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అన్నివర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేశారు. పదేండ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. కేసీఆర్ ఇచ్చేదానికి రెట్టింపు ఇస్తాం.. ఇంకా ఏదో చేస్తామంటూ హామీలు ఇచ్చి ప్రజలను ఊహాలోకాల్లోకి తీసుకువెళ్లి అధికారంలోకి వచ్చింది. తీరా ప్రభుత్వ ఏర్పాటు అనంతరం రెండేండ్లుగా ఏం జరుగుతుందో జగద్విదితమే. కొత్తవి ఏమీ ఇవ్వకపోయినా సరే కేసీఆర్ పథకాలను కొనసాగించకపోవడం గమనార్హం.
ప్రస్తుత ప్రభుత్వంలో ఏదైనా చేస్తామని చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ జీఓలకే దిక్కులేకుండా పోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దురాజ్‌పల్లి లింగమంతుల జాతర సందర్భంగా అభివృద్ధి కోసం రూ.5 కోట్లు విడుదల చేస్తూ జీఓ తీసినా నేటికీ అమలుకు నోచుకోవడంలేదు. ఇలాంటిదే అంగన్వాడీల్లో ఎగ్‌బిర్యానీ పథకం..
ఎగ్ బిర్యానీకి గుడ్‌బై
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, బాలింతలతో పాటు గర్భిణులకు మరింత బలవర్థకమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్ బిర్యానీ పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 1209 అంగన్వాడీ సెంటర్లు ఉండగా 47,308 మంది చిన్నారులతో పాటు ఎనిమిది వేల వరకు గర్భిణులు, బాలింతలు అంగన్వాడీలకు వస్తున్నారు. అమ్మ మాట అంగన్ వాడీ బాట పేరిట జూన్ 11న అంగన్వాడీ సెంటర్లలో ఎగ్‌బిర్యానీ ప్రారంభించారు. మరుసటి రోజు నుంచి నేటి వరకు ఎగ్‌బిర్యానీ స్మెల్ ఏ సెంటర్లో కూడా రావడం లేదు.
దీనికి కారణం ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం బిర్యానీకి కావాల్సిన మసాలాలు, నూనె తదితర మెటీరియల్ కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదు. అందుకే ఎగ్‌బిర్యానీ వండటం లేదని అంగన్వాడీ టీచర్ల ద్వారా తెలిసింది. ఈ విషయమై డీడబ్ల్యూవో నర్సింహారావును వివరణ కోరగా తాను చాలా కాలం సెలవుల్లో ఉన్నానని, తనకు వివరాలు తెలియవని చెప్పారు. ఓ ఐసీడీఎస్ సూపర్వైజర్ను వివరణ కోరగా ప్రభుత్వం ఎగ్ బిర్యానీ వండాలని ఆదేశాలు ఇచ్చిందని, దానికి సంబంధించి ఎలాంటి విధివిధానాలు విడుదల చేయలేదని, అలాగే నిధులు కేటాయించకపోవడంతోనే నిలిచిపోయిందని పేర్కొన్నారు.