Sitting Job | కార్పొరేట్ ఉద్యోగం చేసేవారందరూ కూడా ఎక్కువ సమయం కూర్చొని పని చేస్తూ ఉంటారు. అలాగే గమ్యస్థానాలకు చేరుకునే వారు కూడా ట్రాఫిక్ కారణంగా, దూరం కారణంగా ఎక్కువ సమయం కూర్చొని ఉంటారు. అలాగే కొందరు ఫోన్ ను లేదా టీవీని చూస్తూ ఎక్కువ సమయం కూర్చొని ఉంటారు. ఇలా ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కండరాలు దెబ్బతినడం, జీవక్రియ నెమ్మదించడం, వెన్ను నొప్పి రావడం, హృదయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు తెలియజేస్తున్నారు. ఎక్కువ సమయం కూర్చోవడం ధూమపానంతో సమానమని వారు చెబుతున్నారు. ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని, ఆందోళనతో పాటు భయం కలుగుతున్న భావన కూడా వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకు 11 లేదా అంతకంటే ఎక్కువ గంటలపాటు కూర్చోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం 1.40 రెట్టు ఎక్కువగా ఉటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల గుండె కండరాలు బలహీనంగా తయారవుతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక శరీరాన్ని సాగదీసే సరళమైన వ్యాయామాలు చేయాలి. గుండె ఆరోగ్యాన్ని మార్చుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. కూర్చోవడం వల్ల, సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల దీర్ఘకాలిక నడుము నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నడుము నొప్పి మొత్తం జీవనాణ్యతను తగ్గిస్తుంది. కొన్ని సార్లు చాలా మంది తమ పనులను తాము కూడా స్వయంగా చేసుకోలేకపోతారు. కనుక కండరాలకు ప్రాధాన్యతను ఇచ్చే వ్యాయామాలు, పని శైలిని మార్చుకోవడం ద్వారా నడుము నొప్పి సమస్యని అధిగమించవచ్చు.
ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది. దీంతో ఊబకాయం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఎంత సమయం కూర్చుంటున్నారు అనే అంశాలపై దృష్టి పెట్టడం చాలా అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక కాళ్లు, చేతుల కండరాలు కూడా ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల ప్రభావితమవుతాయి. కండరాల ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం ఉంది. కనుక విరామం తీసుకుంటూ కూర్చోవడం, కండరాల వ్యాయామాలు చేయడం వంటివి చేయాలి. ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
ఎక్కువ సమయం వంగి కూర్చోవడం వల్ల కండరాల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుంది. కీళ్లు, వెన్నెముక నిర్మాణంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. వెన్నెముక వంగడం, తల, మెడ స్థానాలు బలహీనపడడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల ఆందోళన, నిరాశ వంటి భావాలు అభివృద్ది చెందుతాయి. మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల ఇలా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయని ఎక్కవ సమయం కదలకుండా కూర్చోవడం శరీరానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.