Potatoes | ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది తింటున్న కూరగాయల్లో ఆలుగడ్డలు కూడా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల వెరైటీలకు చెందిన ఆలుగడ్డలు అందుబాటులో ఉన్నాయి. ఆలుగడ్డలను మన దేశంలోనూ చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వేపుడు, కూర, పులుసు ఇలా రకరకాలుగా ఆలుగడ్డలను వండి తింటారు. ఆలుగడ్డలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఆలుగడ్డల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని నియంత్రించడంలో సహాయం చేస్తుంది. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉండేలా చేస్తుంది. దీని వల్ల నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే గుండె పనితీరు మెరుగు పడుతుంది.
ఆలుగడ్డల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఐరన్‌ను శరీరం సరిగ్గా శోషించుకునేలా చేస్తుంది. దీని వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి సైతం పెరుగుతుంది. దీంతో చర్మం, కీళ్ల ఆరోగ్యంగా ఉంటాయి. ఆలుగడ్డలను స్టార్చీ వెజిటబుల్‌గా పిలుస్తారు. అంటే వీటిల్లో సంక్లిష్టమైన పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి నిరంతరం శక్తిని అందించడంలో సహాయం చేస్తాయి. అందువల్ల నీరసం, అలసట ఉన్నవారు, శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసిన వారు ఆలుగడ్డలను తింటే త్వరగా శక్తి లభిస్తుంది. మళ్లీ ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. బద్దకం పోతుంది. ఆలుగడ్డలను పొట్టుతో సహా తినాల్సి ఉంటుంది. దీని వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. పొట్ట నిండుగా ఉన్న భావను కలిగిస్తుంది. దీంతో బరువును నియంత్రణలో ఉంచుకోవడం తేలికవుతుంది.
ఆలుగడ్డల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ అని పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించడంలో సహాయం చేస్తాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. ఆలుగడ్డల్లో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. దీని వల్ల మన శరీరంలో సుమారుగా 100కు పైగా ఎంజైమ్‌ల చర్యలు నియంత్రించబడతాయి. ఈ ఎంజైమ్‌ల వల్ల మెదడు అభివృద్ధి చెందుతుంది. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. యాక్టివ్‌గా మారుతారు. మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా ఆలుగడ్డలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.
ఆలుగడ్డలు ఆరోగ్యకరమే అయినప్పటికీ వాటిని కేవలం ఉడకబెట్టి, అది కూడా పొట్టుతో సహా తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఆలుగడ్డలను వేయించినా లేదా చిప్స్ రూపంలో తిన్నా మేలు జరగకపోగా శరీరానికి హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక పలు రకాల వ్యాధులు లేదా అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఆలుగడ్డలను తినకూడదని అంటున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అధికంగా ఉన్నవారు ఆలుగడ్డలను అసలు తినకూడదు. లేదంటే షుగర్ లెవల్స్ మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే బరువు తగ్గాలని డైట్‌ను పాటించేవారు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఆలుగడ్డలకు దూరంగా ఉండాలి. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ వీటిని తింటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.