ఫొటోలోని రైతు పేరు దేశబోయిన నరసింహ. వలిగొండ మండలం రెడ్లరేపాక. 40 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో పత్తి విక్రయించేందుకు శనివారం 30 కిలోమీటర్ల దూరం నుంచి ఆత్మకూరు (ఎం)లోని ఓ మిల్లుకు వచ్చి మొత్తం పత్తిని విక్రయించాడు. క్వింటాకు సుమారు రూ. 6 వేల వరకు మాత్రమే ఇచ్చారు. అదే సీసీఐలో విక్రయిస్తే 8వేలకు పైగా వచ్చేవని, ప్రైవేట్‌లో అమ్మడంతో క్వింటాకు రూ. 2వేల నష్టం వాటిల్లిందని రైతు నరసింహ వాపోయారు.
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) ః పత్తి రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో పత్తి రైతు పరేషాన్ అవుతున్నాడు. సకాలంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో కనీస మద్దతు ధర లభించక నష్టాల పాలవుతున్నారు. చేసేదేం లేక క్లిష్ట పరిస్థితుల్లో ప్రైవేట్‌లో అడ్డికి పావుశేరు లెక్క అమ్ముకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
11.30లక్షల క్వింటాళ్ల పత్తి అంచనా..
వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 1.13 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 11.30 లక్షల క్వింటాళ్ల తెల్ల బంగారం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ సారి సీజన్ ప్రారంభంలో వర్షాలు ముఖం చాటేయగా, ఆ తర్వాత భారీగా కురిశాయి. దీంతో పంట దిగుబడి ఆశాజనకంగానే ఉంది. కాగా జిల్లాలో 12 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఆలేరులో రెండు, చౌటుప్పల్‌లో రెండు మోత్కూరులో ఆరు, వలిగొండలో రెండు సెంటర్లు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఎక్కడా ఒక్క కేంద్రం కూడా ప్రారంభానికి నోచుకోలేదు. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తుండటంతో పత్తి తడిస్తే తేమ పేరుతో నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు.
దళారులకు పంట..
జిల్లాలో ఇప్పటికే పత్తి తీయడం జోరందుకున్నది. ఇప్పటికే ఒక దఫా పత్తి పూర్తయ్యింది. కానీ సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారుల పంట పండుతున్నది. రైతలు తెల్లబంగారాన్ని ఇంట్లో నిల్వ చేసుకునే సామర్థ్యం లేకపోవడంతో వెంటనే అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలు కురిస్తే ఏరిన పత్తి దెబ్బతినే ప్రమాదం ఉండటంతో ప్రైవేట్‌గా విక్రయిస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకున్న దళారులు తక్కువ ధరకే కొంటున్నారు.
తేమ, నాణ్యత లేదని, రంగు మారిందని సాకులు చూపుతూ తక్కువకే తీసుకుంటున్నారు. రైతుల అవసరాలను ఆసరా చేసుకొని ఇళ్ల వద్దకు, పొలాల వద్దకే దళారు వచ్చి.. పత్తి కొంటున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే పత్తికి కనీస మద్దతు ధర క్వింటాకు ఏ గ్రేడ్ రూ. 8110. మామూలు పత్తికి క్వింటాల్‌కు రూ. 8వేలు వచ్చేది. బయట ప్రైవేట్‌లో మాత్రం రూ. 5వేల నుంచి రూ. 6వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో క్వింటాకు సుమారు రెండు వేలకు పైగా నష్టం వాటిల్లుతున్నది. బీఆర్ఎస్ హయాంలో సకాలంలో పత్తి కొనుగోళ్లు చేపట్టేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
పత్తి రైతుల దివాలా..!
కాంగ్రెస్ సర్కారు తీరుతో పత్తి రైతులు దివాలా తీసే పరిస్థితి దాపురించింది. లాభం దేవుడెరుగు.. పెట్టిన పెట్టుబడి కూడా రావడంలేదు. ఎకరా పత్తి పండించేందుకు సుమారు రూ. 30 నుంచి రూ. 35వేల వరకు పెట్టుబడి అవుతుంది. పత్తి తీతకు మరో రూ. 15 వేల వరకు అవుతుంది. మొత్తంగా రూ. 45వేల దాకా ఖర్చు. ఎకరాకు సగటున 8 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. అంటే ఎకరాకు సగటున రూ. 5,500 వచ్చినా.. రూ. 44,000 మాత్రమే జమ అవుతాయి. అలా చూసినా ఎకరానికి రూ. వెయ్యి నష్టం వచ్చినట్లే.
సీసీఐ కేంద్రాలు ప్రారంభించాలి
రాష్ట్ర ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో దళారుల ఇష్టారాజ్యమైంది. తక్కువ ధరకే పత్తిని కొంటున్నారు. క్వింటా పత్తి కేవలం రూ. 6వేలకే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్రంగా నష్టం వాటిల్లుతున్నది. ఫలితంగా రైతులు క్వింటాకు 2వేలు నష్టపోవాల్సి వస్తున్నది. కాంగ్రెస్ సర్కారు స్పందించి వెంటనే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
-పరిదె సంతోష్, యువ రైతు, రాఘవపురం, ఆలేరు