Gold prices | బంగారం ధరలు (Gold prices) ఆల్‌టైమ్ హైకి చేరాయి. ఇప్పటికే కనీవినీ ఎరుగని రీతిలో రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న పుత్తడి ధర తాజాగా మళ్లీ పెరిగింది. తులం బంగారం రూ.1.30 లక్షలకు చేరువైంది. బంగారంతోపాటూ వెండి కూడా ఆకాశాన్ని తాకుతోంది. ఏకంగా రూ.2లక్షలకు చేరువైంది.
మార్కెట్ వర్గాల ప్రకారం.. హైదరాబాద్ (Hyderabad) బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,110గా ఉంది. అదే 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర రూ.1,18,630గా నమోదైంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి 1,83,000కి చేరింది. 2025లో బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 50 శాతానికి పైగానే ధరలు పెరిగాయి. 2022తో పోలిస్తే మొత్తం పెరుగుదల 140 శాతానికి చేరుకుంది. 2026 ప్రారంభం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1.50 వేలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో అతివిలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటం వల్లనే దేశీయంగా బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతుండటం, అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్, రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు, ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించనుండటం, చైనా-అమెరికా మధ్య టారిఫ్‌లు కూడా ధరలు దూసుకుపోవడానికి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నాయి. మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు.
Also Read..
Gold Rates | అమెరికా అప్పులు తీర్చుకునేందుకే.. బంగారం ధరను అంతగా పెంచేస్తుందా!
రివర్స్ మార్ట్గేజ్ తెలుసా..!