న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లో ఇటీవల బంగారం ధర అనూహ్యంగా పెరిగిపోయింది. ఇలా రికార్డు స్థాయిలో పెరగడం ఒక అడ్డంకి ప్రణాళికా? లేదా అమెరికా రుణ సంక్షోభాన్ని అధిగమించడానికి ఒక రహస్య నాటకమా అన్న షాడో థియరీ ప్రచారంలో ఉంది. ప్రస్తుత మార్కెట్ ధరతో లెక్క కడితే అమెరికాలో బంగారం పుస్తక విలువ 11 బిలియన్ డాలర్ల నుంచి ఒక ట్రిలియన్ డాలర్‌కు పెరుగుతుంది. ఈ పెరుగుదలతో అమెరికా సులభంగా తన అప్పులు తీర్చేయవచ్చు. దీంతో ఆ దేశానికి ఇప్పుడు కొత్త అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా, ఆస్తుల అమ్మకాలు జరపకుండా ఆకస్మిక లాభం చేకూరుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. లింక్డ్ ఇన్‌లో వచ్చిన ఒక పోస్ట్ ప్రకారం 1970 నుంచి చూస్తే బంగారం రాబడి 649 రెట్లు ఉంది.
ఈ లోహం ఇటీవలి పెరుగుదలకు నిజమైన కారణమేమిటనే లోతైన చర్చకు దారి తీసింది. పెరుగుతున్న రుణాన్ని భర్తీ చేయడానికి అమెరికా తన బంగారు నిల్వలను తిరిగి అంచనా వేయడానికి సిద్ధమవుతుండవచ్చు అన్న సిద్ధాంతం ప్రచారంలో ఉంది. అమెరికా ఇప్పటికీ తన బంగారాన్ని ఫెడరల్ రిజర్వ్ పుస్తకాలలో 1970లో నిర్ణయించిన ఔన్స్‌కు కేవలం 42.22 డాలర్ల ప్రకారం (ప్రస్తుతం 3,000 డాలర్లు) మాత్రమే నమోదు చేసిందని సీనియర్ సలహాదారు ఆసిన్ గుప్తా తెలిపారు.
అయితే బంగారం 10 రెట్లు పెరిగిన ప్రకారం లెక్క వేసినా అమెరికా ట్రిలియన్ డాలర్ల రుణాన్ని తుడిచిపెట్టేస్తుందని ఆశిష్ యూ అనే మరో ఆర్థిక నిపుణుడు తెలిపాడు. అయితే ఇది డాలర్ పతనానికి దారి తీస్తుందని, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుతుందని హెచ్చరించారు. ఈ వాదనను మరో ఆర్థిక వేత్త సేనుగుప్తా ఖండించారు. బంగారం బలపడితే డాలర్ కూడా బలంగా ఉంటుందని ఆయన అన్నారు.