Harish Shankar | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి దర్శకుడు హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మార్చి 26న విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుపుకుంటుంది. ఇందులో భాగంగా మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఈవెంట్లో ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అనే రెండో పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
పవన్ కళ్యాణ్ రెండు దశాబ్దాలుగా మెడపై చెయ్యి వేసుకునే మేనరిజాన్ని గుర్తు చేస్తూ, దానికి మాటల రూపం ఇవ్వాలనే ఆలోచనతోనే “నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే” అనే డైలాగ్ వచ్చిందన్నారు. ఈ హుక్ లైన్ చెప్పగానే డీఎస్పీ ఉత్సాహంగా స్పందించారని తెలిపారు. మాస్ హుక్ లైన్లో కూడా ఫిలాసఫీ చెప్పొచ్చని దేవిశ్రీ ప్రసాద్ తనకు కాంప్లిమెంట్ ఇచ్చారని చెప్పారు. ఈ పాటను రచయిత చంద్రబోస్ కేవలం రెండు రోజుల్లో ఎనిమిది గంటల్లో రాశారని వెల్లడించారు. ఇది కేవలం అభిమానంతో రాసిన పాట కాదు. పవన్ కళ్యాణ్ లైఫ్ స్టైల్, ఆయన జర్నీపై అవగాహనతో వచ్చిన పాట. ఆయన వ్యక్తిత్వం, కష్టపడే స్వభావం ఈ పాటలో ప్రతి లైన్లో కనిపిస్తుంది. సినిమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ ఆయనకు విజయాలు రాత్రికి రాత్రే రాలేదు. ఆ ప్రయాణం మొత్తం ఈ పాటలో వినిపిస్తుంది” అని హరీష్ శంకర్ అన్నారు.
అభిమానులు పవన్ కళ్యాణ్‌కు పాలాభిషేకం చేస్తారని, కానీ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటతో పాటాభిషేకం చేశారని, చంద్రబోస్ తన సిరాతో సిరాభిషేకం చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ డబ్బుకి ఏమాత్రం లొంగని వ్యక్తి అని హరీష్ శంకర్ స్పష్టం చేశారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత అనేక మంది నిర్మాతలు, కార్పొరేట్ సంస్థలు సినిమాలు, యాడ్స్ కోసం సంప్రదించారని తెలిపారు. 2012లోనే పాన్ ఇండియా అనే పదం లేకపోయినా, ఒక యాడ్ కోసం షారుఖ్ ఖాన్ తీసుకునేంత రెమ్యూనరేషన్‌ను పవన్ కళ్యాణ్‌కు ఆఫర్ చేశారని చెప్పారు. అయితే ఆరోగ్యానికి హానికరమైన లేదా చిన్నపిల్లలకు మంచిది కాని ఉత్పత్తులకు ప్రచారం చేయడం ఇష్టం లేక ఆయన కొన్ని కోట్ల రూపాయల యాడ్స్‌ను తిరస్కరించారని వెల్లడించారు. ఇక సినిమాలో సాంగ్స్, డాన్స్, డైలాగ్స్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్, డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ అన్నీ ఉంటాయి. 2 గంటల 35 నిమిషాల సినిమాలో దాదాపు 2 గంటలు పవన్ కళ్యాణ్‌ను తృప్తిగా చూస్తారు” అని హరీష్ శంకర్ నమ్మకం వ్యక్తం చేశారు.