నలుదిశలా కమ్ముకున్న నిషిద్ధ జాబితా సెగలు, ప్రజల నుంచి నిరసన జ్వాలలు కాంగ్రెస్ సర్కార్‌ను ఊపిరి సలుపనీయకుండా చేశాయి. వాటికి తోడు 22ఏపై బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటంతో ప్రభుత్వం గుక్కతిప్పుకోలేక పోయింది. దీంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులున్న ఇండ్లు, స్థలాల రిజిస్ట్రేషన్‌కు ఆదేశాలిచ్చింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): 22ఏ నిషేధిత భూముల జాబితాపై ప్రభుత్వం దిగొచ్చింది. ఈ సమస్యపై ప్రజలు, బీఆర్ఎస్, ‘నమస్తే తెలంగాణ’ పోరాటంతో ఎట్టకేలకు కండ్లు తెరిచింది. ఇన్ని రోజులు అసలు తప్పే జరుగలేదని, 22ఏ సమస్యే లేదంటూ బుకాయించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ సమస్యలను పరిష్కరించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకొన్నది. 22ఏ జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ అనుమతులు ఉన్న ఇండ్లు, ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీచేసింది.
ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నది. జీహెచ్ ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలక సంస్థలు, డీటీసీపీ లేదా ఇతర పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల నుంచి చెల్లుబాటయ్యే లేఅవుట్, భవన నిర్మాణం లేదా అపార్ట్మెంట్ అనుమతులు పొందిన ఆస్తులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అనుమతి పొందిన అనంతరం జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏదో ఒక లింక్ డాక్యుమెంట్ తప్పనిసరిగా దరఖాస్తుదారులు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా రిజిస్ట్రార్, హెచ్ఎండీఏ/పురపాలక సంస్థ/గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధి సభ్యులుగా ఉంటారని తెలిపింది.
త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే 22ఏ నిషేధిత భూముల జాబితా వివాదం తెరపైకి వచ్చింది. దీంతో సర్కార్ గుండెల్లో గుబులు రేగింది. ఈ సమస్య ఇలాగే ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించడం ఖాయమని భావించింది. ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై వేటుపడింది. దీంతీ ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి, జీహెచ్ఎంసీ పరిధిలోని మరికొంత మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపైనా వేటు తప్పదనే సంకేతాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల భయంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. దీనికితోడు 22ఏ సమస్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ అలుపెరగని పోరాటం చేసింది.
ఇన్నాళ్లూ తమ ఆస్తులను 22ఏలో ఎందుకు పెట్టినట్టు, ఇప్పుడు ఎందుకు తీస్తున్నట్టు అని బాధిత ప్రజానీకం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. సర్కార్ అస్తవ్యస్త నిర్ణయంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని మండిపడుతున్నారు.