Jana Nayagan | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ వివాదాల కారణంగా వాయిదా పడింది. దీంతో సినిమా విడుదల తేదీపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇండియన్ సినిమాలను కెనడాలో విడుదల చేసే ‘యార్క్ సినిమాస్’ సంస్థ తాజా ప్రకటనతో ఏప్రిల్ 30లోపు ఈ సినిమా విడుదల కాదని స్పష్టమైంది. దీంతో మేకర్స్ కొత్త తేదీపై ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం, విజయ్ 52వ పుట్టినరోజు (జూన్ 22)ను దృష్టిలో పెట్టుకుని జూన్ 18న ‘జన నాయగన్’ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ రోజు గురువారం కావడంతో పాటు లాంగ్ వీకెండ్ కూడా కలిసి వస్తుందని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సినిమా టీం కేసులను వెనక్కి తీసుకుని రివైజింగ్ కమిటీకి పంపినప్పటికీ, సీబీఎఫ్సీ Central Board of Film Certification (CBFC) రివ్యూ ఇంకా ప్రారంభించలేదనే సమాచారం వినిపిస్తోంది. సెన్సార్ సర్టిఫికెట్ మరియు ఇతర ఫార్మాలిటీస్ పూర్తయ్యాకే రిలీజ్ డేట్‌పై ప్రకటన వచ్చే అవకాశముంది. అందుకే మేకర్స్ ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారు.
ముందుగా ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు, తర్వాత రివైజింగ్ కమిటీకి పంపాలని ఆదేశించింది. దీనిపై మేకర్స్ కోర్టును ఆశ్రయించారు. సింగిల్ బెంచ్‌లో స్టే వచ్చినప్పటికీ, డివిజన్ బెంచ్‌లో మేకర్స్‌కు అనుకూల నిర్ణయం రాలేదు. అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించినా, అదే డివిజన్ బెంచ్‌లో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. చివరికి కేసును వెనక్కి తీసుకున్న మేకర్స్, రివైజింగ్ కమిటీకి సినిమా పంపాలని నిర్ణయించారు. ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, యంగ్ హీరోయిన్ మమిత బైజు విజయ్ కుమార్తె పాత్రలో కనిపించనున్నారు. కీలక పాత్రల్లో బాబీ డియోల్, నరైన్, గౌతమ్ వసుదేవ్ మీనన్, ప్రియమణి, ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు.