ఒకప్పుడు దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేది. వయసుపైబడిన పెద్దలు తమ పిల్లలపై ఆధారపడేవారు. వారసులు తమ తల్లిదండ్రులను, వారి తల్లిదండ్రులను కూడా బాధ్యతగా చూసుకునేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదనే చెప్పవచ్చు. ఇందుకు మారిన ఆర్థిక పరిస్థితులూ కారణమే. ఎంతోమంది వృద్ధులు ఒంటరిగా జీవిస్తుండటాన్ని చూస్తూనే ఉన్నాం. వారి బాగోగులు వారే చూసుకోవాల్సి వస్తున్నది. ఇక ఖర్చుల సంగతి చెప్పనక్కర్లేదు. వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలు అన్నీఇన్నీ కావు. పిల్లల దగ్గర్నుంచి ఆర్థిక సాయం అందక సీనియర్ సిటిజన్స్‌ను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. కొన్నిసార్లు పింఛన్, ఇతరత్రా ఆదాయాలు ఏమాత్రం సరిపోని దుస్థితి. అయితే ఈ కష్టాల నుంచి బయటపడే మార్గం సొంతిల్లు. రివర్స్ మార్ట్గేజ్ లోన్ ఈ సమస్యకు పరిష్కారం కాగలదు.
రెగ్యులర్ హోమ్ లోన్‌కు పూర్తి విరుద్ధంగా రివర్స్ మార్ట్గేజ్ లోన్ ఉంటుంది. దీనిలో సీనియర్ సిటిజన్లు తమ ఇంటిని బ్యాంక్‌కు లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)కు తనఖా పెడతారు. ఆ తర్వాత ఎంచుకున్న కాలపరిమితిలో నెలనెలా లేదా కోరుకున్న వాయిదాల్లో నగదును రుణగ్రహీతకు ఆ బ్యాంక్/ఎన్బీఎఫ్సీలు ఇస్తాయి. ఆ సొమ్ముతో జీవన వ్యయాలను తీర్చుకోవచ్చు. రుణ కాలపరిమితిలో రుణగ్రహీత చనిపోతే వారి భాగస్వామి ఆ సమయం ముగిసేదాకా ఆ ఇంట్లోనే ఉండవచ్చు. తర్వాత కూడా ఇంట్లోనే జీవించవచ్చు. అయితే బ్యాంక్ నుంచి ఎలాంటి నగదు అందదు. దంపతులిరువురు చనిపోతే లేదా కాలపరిమితి ముగిస్తే వారి వారసులకు రుణమిచ్చిన సంస్థలు రెండు ఆప్షన్స్ ఇస్తాయి. రుణం అసలు, వడ్డీతో సహా చెల్లించి ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. ఇందుకు సాధారణంగా 30-90 రోజుల సమయం ఇస్తారు. లేదంటే రుణదాతలే ఆ ఇంటిని అమ్మి, రావాల్సిన రుణ బకాయిలను తీసుకుంటారు. మిగిలిన సొమ్మును వారసులకు చెల్లిస్తారు. ఒకవేళ ఇంటిని అమ్మినా రుణ బకాయిలు తీరకపోతే ఆ నష్టాన్ని రుణదాతలే భరిస్తారు. రుణం ఇచ్చే సమయంలో ఇంటి విలువకు సంబంధించి రుణదాత తప్పుడు అంచనాల వల్లే ఈ నష్టం కాబట్టి వారసులకు దానితో సంబంధం ఉండదు.
రుణ కాలపరిమితిలో రుణగ్రహీత దివాలా తీసినప్పుడు, ఏడాది కంటే ఎక్కువకాలం ఇంట్లో ఉండనప్పుడు, ఇంటికి బీమా-స్థిరాస్తి పన్నులు చెల్లించనప్పుడు, ఇంటిని అద్దెకివ్వడం లేదా ఇంట్లో కొంత భాగాన్ని అమ్ముకున్నప్పుడు, రుణగ్రహీత మోసాలకు పాల్పడినప్పుడు, ప్రభుత్వం ఏదైనా కారణం చేత ఇంటిని స్వాధీనం చేసుకోవాలనుకుంటే రుణదాత లు రుణ చెల్లింపుల్ని ఆపేస్తాయి.
2007లో రివర్స్ మార్ట్గేజ్ లోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ ఇంకా ఎవరికీ తెలియడం లేదు. ఇందుకు రుణదాతలు వృద్ధులు, వారి వారసులకు అవగాహన కల్పించకపోవడమే కారణమన్న అభిప్రాయాలున్నాయి. ఇక భారత్ వంటి సంప్రదాయ దేశాల్లో ఇల్లు అనేది వారసత్వ సంపదగా భావిస్తారు. అలాంటి ఇంటిని వదులుకోవాల్సి వస్తుందేమోనన్న భయాలు కూడా రివర్స్ మార్ట్గేజ్ లోన్లకు ఆదరణ లేకుండా చేస్తున్నాయి. అంతేగాక రుణభారం పెరిగిపోవడం కూడా ఈ లోన్లకున్న ప్రతికూలతగా చెప్తున్నారు.
పన్ను ప్రయోజనాలు
బ్యాంక్/ఎన్బీఎఫ్సీ చెల్లింపులపై పన్ను మినహాయింపులుంటాయి.
లోన్ టు వాల్యూ రేషియో
ఇంటి విలువలో గరిష్ఠంగా 90 శాతాన్ని రుణంగా పొందవచ్చు.
రుణ కాలపరిమితి
కనిష్ఠంగా 10 ఏండ్లు, గరిష్ఠంగా 20 సంవత్సరాలు.
రుణ పంపిణీ
సాధారణంగా నెల, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక ప్రాతిపదికన రుణగ్రహీతలకు బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు నగదు చెల్లిస్తాయి.
గరిష్ఠంగా నెలవారీ చెల్లింపు
ఎన్‌హెచ్‌బీ మార్గదర్శకాల ప్రకారం నెలకు రూ.50 వేలకు మించరాదు.
ప్రీ-పేమెంట్
నిర్ణీత కాలవ్యవధిలో ముందస్తు చెల్లింపులు జరుపవచ్చు. ఎలాంటి చార్జీల్లేవు.
రీవాల్యుయేషన్
ప్రతీ ఐదేండ్లకోసారి రుణం ఇచ్చినవారు తనఖా పెట్టిన ఇంటి విలువను మళ్లీ లెక్కిస్తారు. మార్కెట్ హెచ్చుతగ్గులు, ఇతరత్రా కారణాల దృష్ట్యా దీన్ని నిర్వహిస్తారు.
నిధుల వినియోగం
ట్రేడింగ్, ఇతరత్రా వ్యాపార అవసరాలకు రుణాన్ని వాడరాదు. కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులు తదితరాలకే వాడాలి.
ఈ లోన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే.. దరఖాస్తుదారుని వయసు తప్పక 60 ఏండ్లు దాటాలి. పైండ్లెతే భాగస్వామికి 55 ఏండ్ల కంటే తక్కువ వయసు ఉండకూడదు.
రివర్స్ మార్ట్గేజ్ లోన్ ఎనబుల్డ్ యాన్యుటీ (ఆర్ఎంఎల్ఈఏ) కూడా అందుబాటులో ఉన్నది. వివిధ సంస్థల భాగస్వామ్యంతో నేషనల్ హౌజింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) దీన్ని పరిచయం చేసింది. దీంతో సీనియర్ సిటిజన్లు (రుణగ్రహీతలు) జీవితాంతం యాన్యుటీ చెల్లింపులు పొందవచ్చు. రివర్స్ మార్ట్గేజ్ రుణగ్రహీతలకు ఉండాల్సిన అర్హతలు, నిబంధనలే ఇక్కడా వర్తిస్తాయి.