నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 29 : ఇంట్లో ఆడబిడ్డలందరూ తీరొక్క పూలను ఒక్కచోటకు చేర్చి.. సహజసిద్ధంగా పూసిన పువ్వులకు మరిన్ని రంగులద్ది.. ఒక్కో పువ్వును వరుసలో పేర్చుకుంటూ.. పండుగ విశిష్టను చెప్పుకుంటూ బతుకమ్మలను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. వాటిపై గౌరమ్మలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సోమవారం సాయంత్రం బతుకమ్మలతో మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మ ఘాట్లు, చెరువులు, కుంటల వద్దకు చేరుకొని చుట్టూ బతుకమ్మలను పెట్టి.. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ ‘చిత్తూ చిత్తూల బొమ్మ.. శివునీ ముద్దుల గుమ్మ..’ అంటూ పాటలు పాడుతూ.. ఆటలు ఆడుతూ సంబురంగా సద్దుల బతుకమ్మ సందడి చేశారు. పొద్దుపోయిన తర్వాత భక్తిప్రపత్తులతో బతుకమ్మలను చెరువులు, కుంటలల్లో నిమజ్జనం చేశారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకొని, తమ వెంట తెచ్చుకున్న ప్రసాదాలను ఒకరికొకరు పంపిణీ చేసుకున్నారు. సంబురంగా ఇంటిబాట పట్టారు.
ఖమ్మం, సెప్టెంబర్ 29: ఖమ్మంలోని తెలంగాణ భవన్లో సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆధ్వర్యంలో తొమ్మిది రోజులుగా బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. బతుకమ్మ నిమజ్ఞనం కోసం కార్యాలయ ఆవరణలోనే ప్రత్యేకంగా నీటి కొలను ఏర్పాటు చేశారు.
సోమవారం నాటి సద్దుల బతుకమ్మ వేడుకలను బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, చంద్రావతి, బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, బెల్లం వేణు, పగడాల శ్రీవిద్య, బెల్లం ఉమ, భారతి, బొమ్మెర రామ్మూర్తి, బిచ్చాల తిరుమలరావు, పగడాల నరేందర్ తదితరులు ప్రారంభించారు. గౌరీదేవి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మలు ఆడి నిమజ్జనం చేశారు.