కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 29 : ఆర్టీసీ సిబ్బందిపై అధికారులు వేధింపులు ఆపాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. ప్రయాణీకుల సౌకర్యం, బస్టాండ్‌లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని సూచించారు. సోమవారం సాయంత్రం కొత్తగూడెం బస్టాండ్‌ను, పరిసర ప్రాంతాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపం వల్లే ఆర్టీసీ బస్టాండు అసౌకర్యాలకు నిలయంగా మారిందని, అధికారులు తీరు మార్చుకుని సౌకర్యాల మెరుగుపై దృష్టి సారించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండుకు నిత్యం వేలాది మంది ప్రయాణికులు వచ్చి పోతుంటారని, త్రాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ లోపం, ఆవరణ పారిశుధ్య లోపం స్పంష్టంగా కనిపిస్తోందని, దీన్ని సరిచేయాల్సిన అధికారులు నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిబ్బందిని వేదించడంపైనే దృష్టి సారిస్తున్న విషయం తనదృష్టికి వచ్చిందని, దీన్ని సరిచేసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందితే చర్యలకు సిఫారసు చేస్తానన్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, బస్టాండు నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధుల కోసం ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని, త్వరలో నిధులు మంజూరవుతాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఎమ్మెల్యే వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకుడు కందుల భాస్కర్, ఆర్టీసీ అధికారులు ఉన్నారు.
Kothagudem Urban : ఆర్టీసీ సిబ్బందిపై వేధింపులు ఆపాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు