న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29 : దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సోమవారం రికార్డులతో హోరెత్తించాయి. మరో సరికొత్త స్థాయికి చేరుకున్నాయి. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల గోల్డ్ రేటు ఢిల్లీలో రూ.1,500 ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,19,500 పలికింది. కిలో వెండి విలువ కూడా ఆల్‌టైమ్ హైలో నిలిచింది. ఈ ఒక్కరోజే ఏకంగా రూ.7,000 పుంజుకొని తొలిసారి రూ.1,50,000గా నమోదైనట్టు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలియజేసింది. సాధారణ కొనుగోలుదారులతోపాటు పరిశ్రమ వర్గాల నుంచి కూడా ఆదరణ ఉండటమే కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
పసిడి, వెండి ధరలు హైదరాబాద్‌లోనూ పరుగులు పెడుతున్నాయి. గతకొద్ది రోజులుగా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి మరి. ఈ క్రమంలోనే సోమవారం 24 క్యారెట్ తులం ధర రూ.920 ఎగబాకి రూ.1,16,400కు చేరింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.850 అందుకుని రూ.1,06,700 వద్ద స్థిరపడింది. అయితే ధరలు క్రమేణా పెరుగుతుండటంతో మార్కెట్లో గిరాకీ అంతంతమాత్రంగానే ఉంటున్నదని వ్యాపారులు చెప్తున్నారు. అవసరమైతే తప్ప కొనుగోలుదారులు రావడం లేదని, అంతేగాక తులం కొనేవారు అర తులంతో సరిపెడుతున్నారని పేర్కొంటున్నారు. నిజానికి ధరలు స్థిరంగా ఉంటేనే వ్యాపారం బాగుంటుందన్న అభిప్రాయాన్ని మెజారిటీ జ్యుయెల్లర్స్ వెలిబుచ్చుతుండటం గమనార్హం.
దీపావళిదాకా బంగారం, వెండి ధరలు పెరగడం ఆగకపోవచ్చని అంటున్నారంతా. దీంతో మున్ముందు మరింతగా రేట్లు పుంజుకోవడం ఖాయంగానే కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే గోల్డ్ రేటు దేశీయంగా తులం రూ.1,25,000, కిలో వెండి ధర రూ.1,70,000దాకా వెళ్లవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ఆల్‌టైమ్ హైని తాకుతూ 3,824.61 డాలర్లుగా ఉన్నది. ఔన్స్ సిల్వర్ 47.18 డాలర్లుగా ట్రేడ్ అవుతున్నది.