Iran attacks : సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) హత్యకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. చుట్టుపక్కల దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు చేసింది. దాంతో పలు దేశాల్లో పేలుళ్ల మోతమోగింది. ఇరాన్ బలగాలు నిన్నటి నుంచి పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులకు పాల్పడటం ఇది ఆరోసారి కావడం గమనార్హం.
మొత్తం 27 అమెరికా బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ వెల్లడించింది. అందులో ఇజ్రాయెల్‌లోని టెల్ నోప్ ఎయిర్ బేస్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం హాకిర్యా కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇజ్రాయెల్‌లోని రక్షణరంగ ఫ్యాక్టరీలను కూడా ఇరాన్ టార్గెట్ చేసుకుంది. ఖతార్ గగనతలం ఆదివారం ఉదయం 7.30 సమయంలో పేలుళ్లతో దద్దరిల్లింది. దాని రాజధాని దోహాలో మొత్తం 11 పేలుళ్లు జరిగాయి. మరోవైపు ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి.
దుబాయ్‌లో ఈ ఉదయం 8.15 గంటల సమయంలో మూడు భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ ప్రయోగించిన ఆయుధాలను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గగనతలంలోనే పేల్చివేశాయి. శకలాలు కూలడంతో దుబాయ్‌లో అత్యంత రద్దీగా ఉండే జబిల్ అలీ పోర్టులో భారీగా మంటలు చెలరేగాయి. మరోవైపు అమెరికా నౌకలకు మందుగుండు సరఫరా చేసే ఎంఎస్పీ షిప్‌పై నాలుగు డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. దీనిని ఆపరేషన్ ట్రూ ప్రామిస్లో భాగంగా చేపట్టినట్లు వెల్లడించింది.
ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్ కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. సైరన్లు మోగిన వెంటనే సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది. ఇరాక్‌లోని ఇర్బిల్ ఎయిర్ పోర్టుపై కూడా దాడి జరిగింది. దాంతో భారీగా పొగ, మంటలు వ్యాపించాయి. బాగ్దాద్‌లోని గ్రీన్ జోన్ సమీపంలో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి.