స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ఏడాది కాలంగా ఊరించిన ప్రభుత్వం ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణకు సమాయత్తమైంది. ఈ మేరకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు, పంచాయతీ, వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించే షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీలకు రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనుంది. ఇందుకోసం అక్టోబర్ 9న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.
-ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 29
షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు రాజకీయ నాయకులు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు క్షేత్రస్థాయిలో సన్నాహాలు ప్రారంభించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ కోలాహలం నెలకొంది. ఖమ్మం జిల్లాలో 283 ఎంపీటీసీ స్థానాలకు, 20 జడ్పీటీసీ స్థానాలకు రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశలో కామేపల్లి, బోనకల్లు, చింతకాని, మధిర, ముదిగొండ, ఎర్రుపాలెం, ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం జడ్పీటీసీలతోపాటు ఈ మండలాల్లోని 149 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 9 నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 23న పోలింగ్ నిర్వహించనున్నారు. 2వ దశలో రఘునాథపాలెం, కొణిజర్ల, సింగరేణి, వైరా, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, ఏన్కూరు జడ్పీటీసీలతోపాటు ఆ మండలాల్లోని 134 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అక్టోబర్ 13 నుంచి 15 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 27న ఎన్నికలు నిర్వహించనున్నారు.
అలాగే, ఖమ్మం జిల్లాలోని 571 గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశ ఎన్నికలను అక్టోబర్ 31, రెండో దశ ఎన్నికలను నవంబర్ 4, మూడో దశ ఎన్నికలను నవంబర్ 8 తేదీల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో ఖమ్మం జిల్లాలోని 183 గ్రామ పంచాయతీల పరిధిలోని 1,686 వార్డు స్థానాలకు, రెండో దశలో 196 గ్రామ పంచాయతీల పరిధిలోని 1,788 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 3వ దశలో 192 గ్రామ పంచాయతీల పరిధిలోని 1,740 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం పోలింగ్ కేంద్రాల వారీగా అధికారులను, ఎన్నికల సిబ్బందిని నియమించే ప్రక్రియను జిల్లా అధికారులు ప్రాంరభించారు. అలాగే బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు.
భద్రాద్రి జిల్లాలోనూ రెండు విడతలుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను, మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు పంచాయతీ రాజ్ అధికారులు జాబితాను సిద్ధం చేశారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, అదనపు కలెక్టర్లు విద్యాచందన, వేణుగోపాల్, జడ్పీ సీఈవో నాగలక్ష్మి కసరత్తు చేసి జాబితాను రూపొందించారు. అయితే, గ్రామ పంచాయతీ ఎన్నికల జాబితాను మాత్రం ఇంకా బయటకు ఇవ్వలేదు.
భద్రాద్రి జడ్పీ పీఠం ఈసారి జనరల్‌కు రిజర్వు కావడంతో ఆశావహులు సీట్ల కోసం కుస్తీ పడుతున్నారు. దీంతోపాటు రిజర్వేషన్లు తారుమారు కావడంతో ఎక్కడి నుంచి బీసీ, జనరల్ ఆశావహ అభ్యర్థులు అధిష్ఠానాల మెప్పు కోసం పాకులాడుతున్నారు. భద్రాద్రి జిల్లాలో మొత్తం 471 పంచాయతీలున్నాయి. వీటిల్లో మొదటి విడతలో 206 గ్రామ పంచాయతీల పరిధిలో 11 జడ్పీటీసీ స్థానాలకు, 113 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 602 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. రెండో విడతలో 265 పంచాయతీల పరిధిలో 11 జడ్పీటీసీ స్థానాలకు, 120 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం 669 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, మొదటి విడత ఎన్నికల కోసం వచ్చే నెల 9న నామినేషన్లు స్వీకరించనున్నారు. 23న మొదటి విడత పోలింగ్ నిర్వహిస్తారు.
మొదటి విడతలో భద్రాచలం, దుమ్ముగూడెం, ఆళ్లపల్లి, అశ్వాపురం, బూర్గంపహాడ్, గుండాల, కరకగూడెం, మణుగూరు, పినపాక, జూలూరుపాడు మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో విడతతో అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, దమ్మపేట, ముకలపల్లి, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.
పరిషత్ ఎన్నికలకు రెండు విడతలుగా జరిగే మండలాల జాబితాను సిద్ధం చేసిన అధికారులు.. పంచాయతీల పరిధిలో జాబితాను కూడా తయారు చేస్తున్నారు. మూడు విడతలుగా జరిగే ఎన్నికల నిర్వహణకు పంచాయతీ అధికారులు కసరత్తు చేసి మంగళవారం విడుదల చేయనున్నారు.
పరిషత్ ఎన్నికలకు రెండు విడతలుగా జరిగే మండలాల జాబితాను సిద్ధం చేసిన అధికారులు పంచాయతీల పరిధిలో జాబితాను కూడా తయారు చేశారు. మొదటి విడతలో 8 మండలాల్లోని 159 గ్రామ పంచాయతీలు, 1,436 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో 7 మండలాల్లోని 156 జీపీలు 1,392 వార్డులు, మూడో విడతలో 7 మండలాల్లోని 156 పంచాయతీలు, 1,340 వార్డుల ఎన్నికలు జరుగుతాయి.