Healthy Foods | ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, పాలు, ఆకుకూరలు, కాయలు తినాలని అందరికీ తెలిసిందే. ఈ ఆహారాలన్నీ కూడా అనేక పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే కొన్నిసార్లు ఎక్కువగా పట్టించుకోని ఆహారాలు కూడా ఇంకా ఎక్కువ పోషకాలను అందిస్తాయి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఆహారాలను చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు. ఆరోగ్యంగా తినడం మంచిదే కానీ తెలివిగా తినడం ఇంకా మంచి ఫలితాలను ఇస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పోషకాహార నిపుణులు సూచిస్తున్న ఆసక్తికరమైన ఆహార మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాల్షియం అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేవి పాలు. ఎముకల బలానికి పాలు చాలా అవసరం. కానీ నువ్వుల్లో కూడా క్యాల్షియం అధికంగానే ఉంటుంది. పాలతో పోలిస్తే నువ్వుల్లోనే క్యాల్షియం అధికంగా ఉంటుంది. 100 గ్రాముల పాలల్లో సుమారు 118 మి.గ్రా. క్యాల్షియం ఉంటుంది. అదే 100 గ్రాముల నువ్వుల్లో 1283 మి.గ్రా. క్యాల్షియం ఉంటుంది. నువ్వుల్లో మంచి కొవ్వులు, ఖనిజాలు కూడా ఉంటాయి. నువ్వుల లడ్డూ, నువ్వుల చిక్కీ వంటి వాటిని తయారు చేసి తీసుకోవడం వల్ల తగినంత క్యాల్షియం లభిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే రక్తం పెరుగుదలకు చాలా మంది పాలకూరను తీసుకుంటూ ఉంటారు. అయితే పాలకూరకు బదులుగా వంటల్లో అధికంగా ఉపయోగించే హలీం గింజలను కూడా తీసుకోవచ్చు. వీటిని గార్డెన్ క్రెస్ సీడ్స్ అని కూడా అంటారు. వీటిలో ఐరన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. 100గ్రాముల పాలకూరలో 2.7 మి.గ్రా. ఐరన్ ఉంటుంది. 100 గ్రాముల హలీం గింజలల్లో దాదాపు 17 మి.గ్రా. ఐరన్ ఉంటుంది. ఈ గింజలను సాంప్రదాయ ఆహారంలో ఐరన్ కోసం ఉపయోగిస్తారు. వీటిని నానబెట్టి పానీయాల్లో, లడ్డూల్లో లేదా గంజిలో కలిపి కూడా తీసుకోవచ్చు.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. విటమిన్ సి అనగానే నారింజ పండ్లే గుర్తుకు వస్తాయి. వీటిలోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. కానీ జామపండులో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. నారింజ పండ్లల్లో కంటే జామపండులోనే విటమిన్ సి మరింత ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల నారింజ పండ్లల్లో 53 మి.గ్రా.విటమిన్ సి, 100గ్రాముల జామపండులో 228 మి.గ్రా. విటమిన్ సి ఉంటుంది. జామపండ్లల్లో విటమిన్ సి తో పాటు ఫైబర్, పాలీఫినాల్స్ కూడా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇవి ఎంతో తోడ్పడతాయి.
పాలు, పాలకూర, నారింజ వంటి ఆహారాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని కానీ వాటితో పాటు నువ్వులు, హలీం గింజలు, జామకాయలు వంటి ఆహారాలను కూడా తీసుకోవాలని వీటిని తీసుకోవడం వల్ల పోషకాలు మరిన్ని అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు. కొన్నిసార్లు అత్యుత్తమ పోషకాలు ఖరీదైన ఆహారాల్లో కాకుండా సంప్రదాయ ఆహారంలో, తక్కువ ధరలో లభించే ఆహారాల్లో కూడా ఉంటాయని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.