Breakfast | రోజును ఎలా ప్రారంభిస్తామనే విషయం మన ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉదయం తీసుకునే ఆహారంలో చిన్నచిన్న ఆరోగ్యకరమైన మార్పులు చేస్తే శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతోపాటు, రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు కూడా సహాయపడతాయని వారు సూచిస్తున్నారు. క్లిష్టమైన డైట్ల కంటే సులభంగా పాటించగలిగే మంచి అలవాట్లే దీర్ఘకాలంలో ఎక్కువ ప్రయోజనం ఇస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలంటే పెద్ద మార్పులు అవసరం లేదని, ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాటించగలిగే చిన్న అలవాట్లే మంచి ఫలితాలను ఇస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సమతుల్యమైన అల్పాహారంలో బాదంపప్పు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చడం లేదా ఉదయం స్నాక్‌గా తీసుకోవడం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడం సులభమవుతుందని వారు పేర్కొంటున్నారు.
రోజులో తీసుకునే మొదటి భోజనం శరీర జీవక్రియ (మెటబాలిజం)ను చురుకుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే రోజంతా శక్తి స్థాయిలను నిలబెట్టడం, ఏకాగ్రతను పెంచడం, మొత్తం ఆహార నాణ్యతను మెరుగుపరచడంలో అల్పాహారం ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నగర జీవనశైలిలో సమయం లేకపోవడం వల్ల చాలామంది అల్పాహారాన్ని పూర్తిగా మానేస్తున్నారు. మరికొందరు త్వరగా సిద్ధమయ్యే, పోషకాలు తక్కువగా ఉండే ఆహారాలను ఎంచుకుంటున్నారు. ఈ అలవాట్లు శరీరానికి అవసరమైన పోషకాలు తగ్గేలా చేసి, కాలక్రమంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు, తృణధాన్యాలు (హోల్ గ్రెయిన్స్), తాజా పండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను చేర్చాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల రోజంతా సరైన ఆహార ఎంపికలు చేసుకునే అవకాశం పెరగడంతోపాటు శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఫ్యాడ్ డైట్లు లేదా కఠినమైన ఆహార నియమాల కంటే ప్రతిరోజూ ఒకే సమయానికి నాణ్యమైన ఆహారం తీసుకోవడం మరింత ముఖ్యమని వారు పేర్కొంటున్నారు. భోజనం చేసే సమయాల్లో క్రమబద్ధత పాటించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వివరించారు. పెరుగుతున్న నగర జీవనశైలి, పనిభారం, ప్యాక్ చేసిన ఆహారాలపై ఆధారపడటం వంటి కారణాలతో చాలామంది ఉదయపు అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉదయం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల అవసరం గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత పెరిగిందని తెలిపారు.బిజీ జీవితంలో కూడా ఆ రోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజువారీ జీవితంలో సులభంగా అమలు చేయగల అలవాట్లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం కొద్దిసేపు ప్రశాంతంగా గడపడం, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం వంటి చిన్నచిన్న మార్పులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని పేర్కొంటున్నారు.
ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది ఉదయం సరైన అల్పాహారం తీసుకోకుండా ఇంటి నుంచి బయలుదేరుతున్నారని, తర్వాత ఆకలితో అధిక క్యాలరీలు, తక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తింటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు బరువు పెరగడం, పోషకాహార లోపాలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఉదయం ప్రోటీన్, ఇతర పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు చేయడం సులభమవుతుంది. అలాగే రోజుకు 2 నుంచి 2.5 లీటర్ల వరకు నీరు తాగడం, తరచూ తక్కువ మోతాదుల్లో పోషకాహారం తీసుకోవడం కూడా దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఉపయోగకరమని నిపుణులు సూచిస్తున్నారు. మంచి ఆరోగ్యం కోసం ఒక్కసారిగా పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదని, ప్రతిరోజూ సమతుల్యమైన అల్పాహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం వంటి చిన్నచిన్న అలవాట్లే దీర్ఘకాలంలో మెరుగైన ఆరోగ్యం, అధిక శక్తి, మంచి పనితీరు, సంపూర్ణ శ్రేయస్సుకు బలమైన పునాది వేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.