తీరొక్కపూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలతో తెలంగాణ ప్రజానీకం బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు. ఊరూరా, వాడవాడలో జరిగిన ఉత్సవాల్లో చిన్నాపెద్ద ఉత్సాహంగా పాల్గొన్నారు. వరంగల్ పద్మాక్షిగుట్ట, ఖిలా వరంగల్, సిద్దిపేట కోమటిచెరువు, వేములవాడ, హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో జరిగిన పూలపండుగకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. బతుకుమ్మ వైభవాన్ని ప్రతిబింబించే ఆటపాటలతో హోరెత్తించారు.
ఒక్కేసి పువ్వేసి చందమామ, చిత్తూచిత్తూల బొమ్మ.. శివునీ ముద్దులగుమ్మ, ఇద్దరక్క చెల్లెండ్లు ఉయ్యాలో.. వంటి సంప్రదాయ బతుకమ్మ పాటలతో ప్రధాన కూడళ్లు మారుమోగాయి. గౌరమ్మను కీర్తించి పాటలు ఆడిపాడిన తర్వాత గంగమ్మ చెంతకు చేర్చారు. పోయిరావమ్మా గౌరమ్మా అంటూ కొలుచుకున్నారు. బతుకుదెరువు కోసం పట్నం, దూరప్రాంతాలకు పోయినోళ్లు.. పండుగ వేళ సొంతూళ్లకు చేరుకోవడంతో పల్లెలు ఆత్మీయ పలకరింపులకు నిలయాలుగా నిలిచాయి.
సోమవారం సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. అంతకుముందు తన నివాసంలో పేర్చిన బతుకమ్మతో హరీశ్‌రావు దంపతులు బంధుమిత్రులు, స్థానిక ప్రజానీకంతో కలిసి బయలుదేరి వెళ్లారు.
కరీంనగర్‌లోని రాంనగర్ సత్యనారాయణస్వామి ఆలయ ఆవరణలో బతుకమ్మ వేడుకల్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. బతుకమ్మ ఎత్తుకుని బయల్దేరారు. ఉత్సవాల్లో మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు నివాసంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బతుకమ్మను పేర్చారు. అదేవిధంగా పర్వతగిరిలోని తన నివాసంలో దయాకర్‌రావు, ఉషా దంపతులు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కాంగ్రెస్ పాలనలో పండుగ పూటా కరెంట్ కష్టాలు తప్పడం లేదు. సద్దుల బతుకమ్మ రోజైన సోమవారం హనుమకొండ జిల్లా పరకాలలో విద్యుత్తు సరఫరాలో 10 సార్లు అంతరాయం కలిగింది. పశువుల సంతలో మహిళలు బతుకమ్మ ఆడుతున్న క్రమంలోనూ కరెంట్ కట్ అయింది. మహిళలు సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో బతుకమ్మ ఆడారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించుకునే బతుకమ్మకు అవమానం జరిగింది. సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్‌లోని రామ్‌లీలా మైదానంలో బతుకమ్మ సంబురాలను మహిళా సమాఖ్య, ఇతర ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. అయితే మున్సిపల్ కార్యాలయంలో తయారు చేసిన బతుకమ్మను కార్మికులు చెత్త సేకరించే వాహనంలో తరలించారు. కార్యాలయ సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని ఊరు మందమర్రిలో బతుకమ్మ వేడుకలు వివాదాస్పదంగా మారాయి. గ్రామంలోని కోదండరామాలయ ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించవద్దని గ్రామానికి చెందిన కొందరు గేటుకు తాళం వేశారు. దళితుల పట్ల వివక్ష చూపడం దారుణమని బాధితులు మండిపడ్డారు. విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలయానికి తాళం వేసినవారు తొలగించారు.