Musi River | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్ వద్ద మూసీ 13 అడుగుల మేర ఉధృతంగా ఉరకలేస్తూ.. జల సవ్వడి చేస్తోంది. ఇక పురానాపూల్ వద్ద మూసీ నది మధ్యలో ఉన్న శివాలయంలో ఓ పూజారి కుటుంబం చిక్కుకుంది. వరద భారీగా పెరగడంతో.. పూజారి కుటుంబం ఆలయంపైకి ఎక్కి నిల్చున్నారు. పూజారి కుటుంబాన్ని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు హైడ్రా, పోలీసులు, రెవెన్యూ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం నలుగురు వ్యక్తులు వరదలో చిక్కుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
మూసీకి వరద పోటెత్తడంతో.. జియగూడ – పురానాపూల్ 100 ఫీట్ల రోడ్డును మూసివేశారు. దీంతో అత్తాపూర్ – పురానాపూల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పురానాపూల్ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. అఫ్జల్ గంజ్ వద్ద ఉన్న మూసీ బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు.