హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశా-గోపాల్పూర్ సమీపంలో తీరందాటింది. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదిలి బలహీనపడనుంది. దీనికి తోడు తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల మధ్యలో ద్రోణి కొనసాగుతున్నది. వాయుగుండం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఏపీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
వాయుగుండం, ద్రోణి ప్రభావంతో శనివారం, ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిందిఏ. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
కాగా.. వాయుగుండం ప్రభావతో ఆంధప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. శనివారం కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.