రామవరం, అక్టోబర్ 13 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో రోజురోజుకు కార్మిక కుటుంబాలపై కోతుల దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో కోతుల దాడి నుండి రక్షించాలని స్థానిక నాయకులు మందుల జయరాజు ఆధ్వర్యంలో ఏరియా జీఎం శాలెం రాజును సోమవారం కలిసి మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పూల రవీందర్ మాట్లాడుతూ.. సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కార్మిక కుటుంబాల పిల్లలు, మహిళలపై కోతులు పైశాచికంగా దాడులు చేసి గాయపరుస్తున్నట్లు తెలిపారు. మహిళలు, స్కూల్కు వెళ్లే పిల్లలు తీవ్ర ఇబ్బందులు, భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. దీనివల్ల కార్మికులు డ్యూటీలకు వెళ్లిన సమయంలో ఇంట్లో వారికి భద్రత లేని కారణంగా ఆందోళనతో వారు డ్యూటీలు సైతం సరిగ్గా చేయలేరన్నారు. కావున తక్షణమే స్పందించి కార్మిక కుటుంబాలకు కోతుల బెడద నుండి రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గుత్తుల దుర్గాప్రసాద్, భూక్య రవి, మారేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.