నల్లగొండ, నవంబర్ 03 : నల్లగొండ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 33 ద్వారా ఈ నెలాఖరు వరకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్వాధీన పరుస్తామని పిడి హౌసింగ్ రాజ్‌కుమార్, ఆర్డిఓ అశోక్ రెడ్డి తెలిపారు. సోమవారం డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల కలెక్టరేట్ ధర్నా శిబిరానికి విచ్చేసిన అధికారులు వారి నుండి వినతిపత్రాన్ని స్వీకరించి ఈ మేరకు హామీ ఇచ్చారు. నల్లగొండ పట్టణంలో నిర్మించిన 552 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్వాధీన పరచాలని డిమాండ్ చేస్తూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పోరాట సాధనా కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. లబ్ధిదారులకు వెంటనే ప్రొసిడింగ్స్ అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2017లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శిథిలావస్థకు చేరుతున్నాయని, వాటిని లాటరీ ద్వారా ఎంపిక చేసి పేదలకు పంపిణీ చేయాలన్నారు.
2023లో సిపిఎం కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షల ఫలితంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి విచారణ అనంతరం 3 వేల మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. వివిధ ఫంక్షన్ హాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధి సమక్షంలో సీసీ కెమెరాల నిఘాలో లాటరీ ద్వారా 552 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని నల్లగొండ కలెక్టరేట్ ముందు, ఎమ్మార్వో, ఆర్డీఓ, పెద్ద గడియారం సెంటర్లో అనేకమార్లు ధర్నాలు, నిరాహార దీక్షలు చేసిన తర్వాత మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించి పనులు ప్రారంభించారన్నారు. 552 మంది లబ్ధిదారులకు ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇచ్చి తక్షణ మరమ్మతుల కోసం ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు.
పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లైఫ్ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈ నెలాఖరు నాటికి రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 33 ద్వారా ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్వాధీన పరుస్తామని పిడి హౌసింగ్ రాజ్‌కుమార్, ఆర్డిఓ అశోక్ రెడ్డి తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల కలెక్టరేట్ ధర్నా శిబిరానికి వచ్చి వారి నుండి వినతిపత్రాన్ని స్వీకరించిన అనంతరం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 33 ద్వారా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లన్నింటినీ లబ్ధిదారులకు స్వాధీన పరచమని ఇచ్చిన ఆదేశాల ప్రకారం నల్లగొండ పట్టణంలో 2023లో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్వాధీనం పరుస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట పంచాయతీ రాజ్ ఈఈ, నల్లగొండ తాసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఉన్నారు.
ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ ఆశయం, జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, ఉట్కూరు మధుసూదన్ రెడ్డి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ కన్వీనర్ అవుట రవీందర్, కమిటీ సభ్యులు గంజి రాజేశ్, సిరాజుద్దీన్, కీసరి ప్రశాంతి, గౌసియా, విజయలక్ష్మి, రజిని, ధనమ్మ, గిరిజ, పార్వతి, లతీఫ్ జహంగీర్, పగిళ్ల శ్రీను, యాదమ్మ, అనురాధ, వెంకటమ్మ, రజాక్ పాల్గొన్నారు.