జోగులాంబ గద్వాల : జిల్లాలోని గట్టు మండలంలో అమలు చేస్తున్న ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం(Aspirational Blocks Program ) విజయవంతం చేయాలని ఏబీపీ జిల్లా అధికారి, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి అలగు వర్షిణి ( Varshini ) జిల్లా అధికారులకు పిలుపునిచ్చారు. నీతి అయోగ్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాంకు జిల్లాలోని గట్టు మండలం ఎంపికవడంతో జిల్లా అధికారిగా గ్రామంలో పర్యటించారు.

గట్టులోని సాంఘిక సంక్షేమ వసతిగృహ సమావేశపు మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై కార్యక్రమం పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, పోషణ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం తదితర కీలక రంగాల్లో చెప్పుకోదగ్గ పురోగతి సాధించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఏబీపీలోని 39 అంశాలు కీలక పనితీరు సూచీలని పేర్కొన్నారు.
జిల్లాస్థాయి, సంబంధిత శాఖల అధికారులు ప్రతి సూచీలో సాధించిన పురోగతిపై సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశించారు. అనంతరం నల్లగట్టు తండాలో అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. కేంద్రం నిర్వహణకు సంబంధించిన వివిధ రికార్డులను, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆధార్ ఎన్రోల్మెంట్ పెంచాలని, లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు, గర్భిణులతో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారిని విజయలక్ష్మి, చేనేత జౌళి శాఖ అధికారి గోవిందయ్య, తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీవో చెన్నయ్య ఇతర మండల అధికారులు పాల్గొన్నారు.