పెన్పహాడ్, నవంబర్ 03 : పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పెన్పహాడ్ ఎస్ఐ కాస్తల గోపికృష్ణ అన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సోమవారం మండల పరిధిలోని దోసపహాడ్లో గల మహాత్మ జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలలో షీ టీమ్స్, పోలీస్ కళా బృందంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ మోసాలకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చుట్టూ ఉన్న వారిని విద్యార్థులు జాగృతం చేయాలన్నారు. మొబైల్ ఫోన్ ద్వారానే 90 శాతానికి పైగా సైబర్ నేరాలు జరుగుతున్నట్లు తెలిపారు.
వ్యక్తిగత సమాచారాన్ని లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. వాటి కట్టడికి అప్రమత్తత ఒక్కటే మార్గమన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వైపు వెళ్తే జీవితాలు నాశనం అవుతాయన్నారు. విద్యార్థులు క్షణికావేశాలకు దూరంగా ఉండాలన్నారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ ఫిర్యాదు చేయలని, అలాగే వేధింపులపై 100 కు డయల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురిచేస్తే షీ టీమ్ ఫోన్ నంబర్ 8712586056 కి సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ధనమ్మ, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కళా బృందం ఇన్చార్జి మల్లయ్య, గోపయ్య, గురులింగం, కృష్ణ పాల్గొన్నారు.