హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్-462ఏ కింద మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. జ్యుడీషియల్ సభ్యులను కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామమని తెలిపింది. చట్ట నిబంధనల అమలు మేరకు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తే కోర్టులపై కేసుల భారం తగ్గుతుందని అభిప్రాయపడింది. విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
మేడ్చల్ మలాజిగిరి జిల్లా ఉప్పల్ మండలం కొత్తపేటలో రాదేశ్యాం కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్‌కు ఇచ్చిన భవన నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని కోరుతూ జే శ్రీనివాసయాదవ్ ఇతరులు వేసిన పిటిషన్‌ను గతంలో సింగిల్ జడ్జి కొట్టేయడంతో ఆయన అప్పీల్ పిటిషన్ వేశారు. దీనిని బెంచ్ విచారణ సందర్భంగా.. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్-462ఏ కింద బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వానికి సూచన చేయాలని ఏజీకి సూచించింది.
అక్రమ నిర్మాణాలు, అనుమతి లేని నిర్మాణాలపై కేసులు నమోదవుతున్నాయని గుర్తు చేసింది. దీనిపై ఏజీ సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ.. భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించిన కేసులను ట్రిబ్యునల్స్ పరిషరించలేవని చెప్పారు. సెక్షన్-452 కింద చట్టవిరుద్ధంగా కూల్చివేతలు, నిర్మాణాల్లో మార్పులు, సెక్షన్-450 కింద తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతులు పొందినప్పుడు దాన్ని రద్దు చేసే అధికారం, సెక్షన్-461ఏ కింద అనధికార నిర్మాణాలు చేపట్టినప్పుడు వాటిని సీజ్ చేయడం తదితరాలపై విచారణ చేపడుతుందని వివరించారు. దీనిపై హైకోర్టు.. బిల్డింగ్ నిబంధనల్లోని 596, 597 కింద వివాదాలను పరిషరించడానికి ట్రిబ్యునల్ ఏర్పాటు అవసరమని పేర్కొన్నది.
2017 జనవరిలో తీసుకొచ్చిన చట్టం ప్రకారం బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకపోవడంతో కక్షిదారులు నేరుగా కోర్టుకు వస్తున్నారని వ్యాఖ్యానించింది. ట్రిబ్యునల్‌లో జ్యుడీషయల్ సభ్యులతోపాటు 8 మంది టెక్నికల్ మెంబర్స్ ఉండొచ్చునని తెలిపింది. ప్రభుత్వ ప్రతిపాదనలు అందగానే జ్యుడీషియల్ సభ్యులను కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేసింది. పిటిషన్‌పై స్పందిస్తూ.. అనుమతుల వివరాలివ్వాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. విచారణను వచ్చే నెల 15కి వాయిదా వేసింది.