హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): కాంట్రాక్ట్ లేదా తాతాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఉమాదేవి కేసులో ఇచ్చిన గైడ్‌లైన్స్ మేరకు సమగ్ర పథకాన్ని రూపొందించే అంశాన్ని అమలు చేసే దిశగా పరిశీలన చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. జేఎన్టీయూ జారీ చేసిన తొలగింపు మెమోను సవాలు చేస్తూ, ఉద్యోగి ఏ నరసింహ దాఖలుచేసిన పిటిషన్‌ను గతంలో విచారించిన సింగిల్ జడ్జి, జీవో-212 ప్రకారం పిటిషనర్ సేవలను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు.
యూనివర్సిటీ జారీ చేసిన మెమోను రద్దు చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జేఎన్టీయూ దాఖలు చేసిన అప్పీల్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. పదేండ్లకుపైగా సేవలందిస్తున్న ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేసింది. ఉద్యోగులను గుర్తించే ప్రక్రియ చేపట్టవచ్చని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డికి సూచించింది. విచారణను ఏప్రిల్ 14కు వాయిదా వేసింది. అప్పటి వరకు సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ స్టే విధించింది.