న్యూఢిల్లీ, మార్చి 12 : తమ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తమ నిరసనను వ్యక్తం చేసిన విపక్షాలు.. ఇప్పుడు భారత దేశ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ)పై దృష్టి పెట్టాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ 130 మంది లోక్‌సభ, 63 మంది రాజ్యసభ ఎంపీలు నోటీస్‌పై సంతకం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ అభ్యర్థన నోటీసును శుక్రవారం విపక్షాలు ఏదో ఒక సభలో అందజేస్తాయని తెలిసింది. ఆ నోటీస్‌పై సంతకం చేయడానికి ఎంపీలు ఎంతో ఉత్సాహాన్ని చూపించారని ఒక విపక్ష ఎంపీ తెలిపారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించమని కోరడానికి కనీసం 100 మంది లోక్‌సభ, 50 మంది రాజ్యసభ సభ్యుల సంతకాలు అవసరమని నిబంధనలు చెబుతున్నాయి. కాగా, ఇండియా కూటమిలోని అన్ని పార్టీల ఎంపీలు ఈ నోటీస్‌పై సంతకం చేసినట్టు ఆ ఎంపీ తెలిపారు. కొంతకాలంగా కూటమికి దూరంగా ఉంటున్న ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఈ నోటీస్‌పై సంతకం చేసింది. సీఈసీని తొలగించాలని నోటీస్ ఇవ్వనుండటం ఇదే ప్రథమం. కాగా, ప్రస్తుతం జరుగుతున్న సర్ సహా, పలు అంశాల్లో కేంద్రంలోని అధికార బీజేపీకి అనుకూలంగా ఉన్నారన్న ప్రధాన విమర్శతో పాటు ఆ నోటీస్‌లో సీఈసీపై ఏడు ఆరోపణలు పొందుపరిచినట్టు తెలిసింది.
కచ్చితమైన నియమాలు, నిబంధనల ప్రకారం లోక్‌సభ కార్యకలాపాలు ఉంటాయని, ఏ సమయంలోనైనా, ఏ అంశంమీదైనా సభ్యుడు మాట్లాడుతానంటే.. కుదరదని స్పీకర్ ఓం బిర్లా తేల్చిచెప్పారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత గురువారం లోక్‌సభలో ఆయన స్పందించారు. విపక్ష ఎంపీల మైక్రోఫోన్ కట్ చేయడానికి తన వద్ద ఎలాంటి బటన్ లేదని అన్నారు. సభ నియమ నిబంధనలకు ఎవరూ అతీతులు కారని ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి అన్నారు. స్పీకర్ స్థానం ఏ ఒక్క వ్యక్తికి చెందినది కాదని అన్నారు.