రామగిరి, నవంబర్ 03 : ప్రైవేట్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలికంగా చెలించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలు, బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర కళాశాలల యాజమన్యాలు సోమవారం నుండి మళ్లీ కళాశాలల నిరవధిక బంద్ చేపట్టారు. ఆయా కళాశాల ఎదుట బంద్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారించే వరకు బహిష్కరణ కొనసాగిస్తామని ఎంజీయూ టీపీడీపీఎంఏ, ఎంజీయూ ప్రైవేట్ బీఈడీ కళాశాలల అసోసియేషన్, ఇంజినీరింగ్, ఫార్మస్సీ కళాశాలల యాజమాన్యాలు నిర్ణయం వెల్లడించాయి.
ఈ సందర్భంగా ఆయా కళాశాలల యజమన్యాలు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల ఆధ్వర్యంలో బంద్ చేస్తున్నట్లు తెలిపారు. రీయింబర్స్మెంట్ విడుదల చేయడంలో సర్కార్ జాప్యం చేస్తుండడంతో యాజమాన్యాలు అధ్యాపకుల జీతాలు, భవనాల అద్దెలు, కరెంట్ బిల్లులు, యూనివర్సిటీ రుసుములు, బిల్డింగ్ ట్యాక్స్ చెల్లించడానికి నానా అవస్థలు పడుతున్నట్లు, అప్పు చేసి అవన్నీ చెల్లిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత అప్పులకు వడ్డీలు చెల్లించలేక, కొత్త అప్పులు పుట్టక అధ్యాపకులకు, భవనాల యాజమానులకు సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు.
నల్లగొండలోని బంద్ లో నీలగిరి డిగ్రీ అండ్ ఫీజీ కళాశాల ప్రిన్సిపాల్, రాష్ట్ర నాయకుడు మారం నాగేందర్రెడ్డి, కాకతీయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.నర్సింహ్మరెడ్డి, డీవీఎం, అరబిందో, ఆల్ మాదీనా, గోకుల్, కళాశాలల యాజమన్యాలు, ప్రిన్సిపాల్స్ చొల్లేటి శ్రీధరాచారి, బి.నారాయణరెడ్డి, బొడ్డుపల్లి రామకృష్ణ, ఆర్.సత్యనారాయణ, పి.శ్రీధర్ రెడ్డి, మేడిపల్లి రవి, ఏ.సరిత, శ్రీదేవి, జె.పుష్పాంజలి, తాటి శ్రీనివాస్, హైమద్ హుస్సేన్, శరత్ చంద్ర, సిద్ధిఖీ, సిద్ధార్థ డిగ్రీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ గుండబోయిన జానయ్యయాదవ్, చైర్మన్ లింగయ్య, ఆయా కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.

Ramagiri : ‘ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేంత వరకు కళాశాలల నిరవధిక బంద్’