– అనుముల మండలం కొత్తలూరులో ఫ్యాక్టరీ ఏర్పాటు
– పతంజలి డీజీఎం బొల్లంపల్లి యాదగిరి
దామరచర్ల, ఫిబ్రవరి 20 : ఇప్పుడున్న పరిస్థితుల్లో వరి, ప్రత్తి, బత్తాయి వంటి ఇతర పంటల ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని అధిక ఆదాయం పొందే పంట కేవలం ఆయిల్‌పామ్ మాత్రమే అని పతంజలి డీజీఎం బొల్లంపల్లి యాదగిరి అన్నారు. అనుముల మండలం కొత్తలూరు గ్రామంలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని తెలిపారు. రైతులు మొక్కలు నాటుకునే సమయంలో బై బ్యాక్ పాలసీ అగ్రిమెంట్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పతంజలి కంపెనీ గెలలు కొనుగోలు చేస్తుందని చెప్పారు. శుక్రవారం నల్లగొండ జిల్లా దామరచర్ల రైతు వేదిక నందు పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ అద్వర్యంలో ఉద్యాన శాఖ సహకారంతో, ఆయిల్ పామ్ సాగుపై సాంకేతిక సమావేశంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న పామ్ ఆయిల్ సాగు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాషిణి, నియోజకవర్గ ఉద్యాన అధికారి నసీమ, వ్యవసాయ అధికారి రూపేంద్ర మణి, ఎమ్మార్వో బానోతు జవహర్లాల్ పతంజలి జిల్లా మేనేజర్ డా.మధుసూదన్ రెడ్డి, కోరమాండల్ కంపెనీ, ఇఫ్కో కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ డీజీఎం బొల్లంపల్లి యాదగిరి మాట్లాడుతూ.. రైతు కేవలం ఒక ఆయిల్‌పామ్ సాగు ద్వారా ఒక ఎకరానికి రూ.1,50,000 నికర ఆదాయం పొందవచ్చు అన్నారు. నాటిన మూడు సంవత్సరాల నుండి కాపు ప్రారంభం అయి 30 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తుందన్నారు. అంతేకాకుండా అంతర పంటలుగా కోకో, వక్క సాగు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు అని తెలిపారు. పతంజలి జిల్లా మేనేజర్ డా.మధుసూదన్ రెడ్డి రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్లుప్తంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు కల్పిస్తున్న ప్రోత్సాహకాల గురించి, బిందు సేద్యం సబ్సిడీ (SC, ST లకు 100%, OC, BC లకు 90%)ని తెలిపారు.
మొక్కలపై ఇస్తున్న సబ్సిడీ గురించి మిర్యాలగూడ ఉద్యాన అధికారిణి నసీమా వివరించారు. ప్రతి ఎకరానికి రూ.4,200 నిర్వహణ ఖర్చును కూడా అందిస్తోందని చెప్పారు. కావునా రైతులు ప్రభుత్వ సబ్సిడీలను వినియోగించుకుని తక్షణమే ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు రావాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో విత్తన అభివృద్ధి సంస్థ రీజినల్ మేనేజర్ కృష్ణవేణి, నల్లగొండ ఆయిల్ పామ్ సొసైటీ ప్రెసిడెంట్ గురువా రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, మండల ఏఈఓలు, గ్రామ పెద్దలు, పతంజలి కంపెనీ సిబ్బంది ప్రగతిశీల రైతులు 150 మంది వరకు పాల్గొన్నారు.