వరంగల్‌చౌరస్తా, నవంబర్ 3 : ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధితో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా సమస్యాత్మక గర్భస్థ, ప్రసూతి వైద్య సేవలందించే చందాకాంతయ్య స్మారక (సీకేఎం) ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో నిమిషం నిలబడలేని పరిస్థితి నెలకొంది. నిత్యం వందల సంఖ్యలో వచ్చే గర్భిణులు, బాలింతలు ముక్కులు మూసుకొని, ఊపిరి బిగపట్టి వైద్యం పొందాల్సి వస్తున్నది. కొత్తగా జన్మించిన నవజాత శిశువులు, శస్త్ర చికిత్సలు నిర్వహించుకున్న మహిళలు సంచరించే ప్రాంతంలో కనీస పారిశుధ్య చర్యలు కనిపించడంలేదు.
గతంలో సైతం కలెక్టర్లు సదరు పారిశుధ్య కాంట్రాక్టర్‌ను మందలించినా తీరు మారడం లేదు. హాస్పిటల్ ఆవరణ పూర్తిగా చిన్నస్థాయి డంపింగ్ యార్డును తలపిస్తున్నది. హాస్పిటల్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచడానికి గతంలో 15 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వర్తించే వారు. గత ప్రభుత్వం కేసీఆర్ కిట్‌తో పాటుగా మెరుగైన వైద్యం అందించడంతో సేవలను వినియోగించుకునే మహిళల సంఖ్య రెండు రెట్లు పెరిగింది.
దీంతో పారిశుద్య చర్యలను మెరుగు పర్చడం, పేషెంట్ కేర్ వ్యవస్ధను పటిష్టం చేయడం కోసం అధికారులు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించారు. నూతనంగా నియమించిన సిబ్బందిని కార్యాలయ విధులకు వినియెగిస్తుండడంతో శానిటేషన్ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా మారింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 23 మంది పారిశుధ్య పనులు చేస్తున్నప్పటికీ విధుల్లో మాత్రం 13 మంది మాత్రమే ఉంటుండడంతో నిర్వహణ గాడి తప్పింది. పారిశుధ్యం సరిగా లేకపోవడంతో శస్త్రచికిత్సలు నిర్వహించుకున్న మహిళల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యాధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పటిష్ట పారిశుధ్య చర్యలు చేపట్టాలని పలువురు మహిళలు కోరుతున్నారు.