దేశంలో జరుగుతున్న అన్ని ఎన్నికలతో పోలిస్తే బీహార్ ఎన్నికలు కీలకమైనవి. దేశ రాజకీయాలపైనా ప్రభావం చూపేలా బీహార్ ఎన్నికలుంటాయి. బీహార్ అనేక ప్రాంతీయ పార్టీల కలయిక. గిరిజన ఆదివాసీ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, వీటికితోడు జాతీయ పార్టీలు ఇలా అనేక పార్టీలు బీహార్‌లో తలపడుతున్నాయి. ఈ సారి జరుగబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు పరీక్షే. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన నితీష్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకమైనవి. అయితే అన్ని పార్టీలు రాజకీయ బురద జల్లుకుంటుండంతో ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా సాగుతున్నాయి.
బీహార్ ఎన్నికల్లో రెండు కూటములు ఏర్పడ్డాయి. ఎన్డీయే కూటి పక్షాన బీజేపీ+జేడీయూ+ఎల్జేపీ (రామ్‌విలాస్)లు, ఎన్డీయే కూటమి పక్షాన కాంగ్రెస్+ఆర్జేడీ+కమ్యూనిస్టు సురాజ్ పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. దేశంలో ప్రముఖ రాజకీయ స్ట్రాటెజిస్ట్‌గా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ స్థాపించి సొంతంగా బరిలోకి దిగుతున్నారు. ఈ పార్టీ ఎన్నికల ప్రచారంలో అంతగా ప్రభావం చూపనప్పటికీ, ఓట్లు భారీగా చీల్చే అవకాశం ఉన్నది. మైనారిటీ ఓట్లు సైతం బీహార్‌లో భారీగా ఉన్నాయి. మజ్లిస్ పార్టీ బీజేపీకి బీ టీంగా వ్యవహరిస్తున్నదని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇండియా కూటమి మజ్లిస్‌ను పక్కనపెట్టింది.
మజ్లిస్ సైతం సవాలుగా 100 స్థానాల్లో సొంతంగా పోటీచేసి తీరుతామని చెప్పడంతో మైనారిటీ ఓట్లు ఎటువైపునకు పడతాయో అన్నది అంతుచిక్కటం లేదు. కమ్యూనిస్టు పార్టీలు సైతం యువతకు పెద్దపీట వేస్తూ ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి ఎన్నికలో ్లగెలుపొందిన అభ్యర్థులను బరిలో నిలిపాయి. బీహార్-జార్ఖండ్ సరిహద్దులో ఉన్న గిరిజన తెగల కోసం కొన్ని స్థానాలో ఝార్ఖండ్ విముక్తి మోర్చా సైతం బరిలో నిలిచింది. ఈ విధంగా అనేక పార్టీల కలయికతో బీహార్ ఎన్నికలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఏ కూటమి అధికారం చేపట్టినా స్వల్ప మెజారిటీతోనే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీహార్ ఎన్నికలు కీలకంగా మారడానికి ప్రధాన కారణం (ఎస్ఐఆర్) స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. భారత ఎన్నికల సంఘం అనాధారిత, అసంబద్ధ, ఫేక్ ఓటర్లను తొలగించడానికి బీహార్‌లో ఉన్న ఓటర్ల జాబితాను వడపోసింది. ఓటర్లను వారి సంబంధిత పత్రాలతో (11 పత్రాలను) బూత్ లెవెల్ ఆఫీసర్‌కు సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండే నియోజకవర్గాల్లో ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపణ వచ్చింది. సుప్రీం కూడా జోక్యం చేసుకొని ఈ ప్రక్రియను అందరికి ఆమోదయోగ్యం అయ్యేవిధంగా ఉండాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఎన్నికల సంఘం మొత్తం ప్రక్రియను 3 నెలల్లో పూర్తిచేసి 68 లక్షల ఓటర్లను తొలగించింది. ఇది పెద్ద ప్రభావం చూపే ఆస్కారం ఉంది. ఎన్నికల సంఘం 2025, సెప్టెంబర్ 30 నాటికి 7.5 కోట్ల ఓటర్లతో నూతనంగా జాబితాను విడుదల చేసింది. మొత్తంగా బీహార్‌లో హంగ్ ఏర్పడితే ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్ పార్టీఎవరికీ మద్దతు ఇస్తుందనేది కీలకం కానున్నది. చిన్న పార్టీలు సైతం ఓట్లను చీల్చే అవకాశం స్పష్టంగా కనపడుతున్నది
– కన్నోజు శ్రీహర్ష