Kani Kusruti | తాప్సీ పన్నూ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు అనుభవ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అస్సి’ (Assi) చిత్రంలో అత్యాచార బాధితురాలిగా నటించిన మలయాళ నటి కని కుస్రుతి తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఫిబ్రవరి 20న ఈ చిత్రం విడుదల కాబోతుండగా.. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఈ చిత్రంలో ‘పరిమ’ అనే వివాహిత పాత్రలో నటించబోతున్నట్లు తెలిపింది.
అత్యాచారానికి గురైన ఒక మహిళ అనుభవించే మానసిక వేదనను వేరొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. అలాంటి పాత్రలో తాను నటించడం చాలా సవాలుతో కూడుకున్నది. ఒక నటిగా ఆ వేదనకు సాధ్యమైనంత దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నించానని, కొన్ని క్షణాల్లో అది నిజంగా తనకే జరుగుతోందా అనేంతగా లీనమయ్యానని కని తెలిపారు. అయితే ఆ ట్రామాలోకి పూర్తిగా వెళ్లడం వల్ల వ్యక్తిగతంగా తనపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో కొంత దూరం పాటించానని ఆమె వివరించారు.
భారతదేశంలో పెరుగుతున్న ఒక మహిళగా ఇలాంటి దాడులు లేదా వేదనల గురించి అవగాహన ఉండటం తనకు సహజమని తెలిపిన కని.. తన సన్నిహితులు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం వల్ల ఇది మన చుట్టూ ఉండే చేదు వాస్తవమని కని పేర్కొన్నారు. ఈ సినిమా ద్వారా భారతీయ న్యాయ వ్యవస్థలోని క్లిష్టతలను కూడా తాను అర్థం చేసుకున్నానని, కోర్టు విచారణల సమయంలో బాధితులు పాత గాయాలను మళ్లీ తలుచుకుంటూ ఎంత నరకం అనుభవిస్తారో తనకు అర్థమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నివసించే పరిమ అనే మహిళ కిడ్నాప్‌కు గురై, సామూహిక అత్యాచారానికి గురైన తర్వాత ఆమె న్యాయం కోసం చేసే పోరాటం చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. ఈ చిత్రంలో తాప్సీ పన్నూ లాయర్‌గా నటించగా, మహమ్మద్ జీషన్ అయ్యూబ్, మనోజ్ పహ్వా, రేవతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేశంలో రోజుకు సగటున నమోదవుతున్న 80 అత్యాచార కేసులను సూచిస్తూ ఈ చిత్రానికి ‘అస్సి’ (హిందీలో 80) అని పేరు పెట్టారు.