జనగామ చౌరస్తా, నవంబర్ 03 : జనగామ మండలంలోని గానుగుపహాడ్, చీట కోడూరు గ్రామాల్లో బ్రిడ్జిలు నిర్మించాలని రాష్ట్ర మంత్రులు, అధికారులకు పలుమార్లు వినతి పత్రం అందించినా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చిత్రపటాలను గాడిదకు అతికించి బ్రిడ్జి సాధన సమితి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు గాడిదతో ఊరేగింపు ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ తీరును నిరసిస్తూ గ్రామస్తులు తలకిందులుగా శీర్షాసనం వేశారు. అనంతరం జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ పింకేష్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బ్రిడ్జి సాధన సమితి నాయకులు యాసారపు కరుణాకర్, ఉమాపతి గౌడ్ మాట్లాడుతూ.. జనగామ మండలంలోని గానుగపహాడ్- హుస్నాబాద్ రహదారితో పాటు చీటకోడూరు కల్వర్టు రెండేళ్ల క్రితం కొట్టుకుపోయిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు బ్రిడ్జిల నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇందులో గానుగు పహాడ్ హుస్నాబాద్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.2 కోట్లు, చీట కోడూరు బ్రిడ్జి నిర్మాణానికి రూ.8 కోట్లు కేటాయింపు చేశారు. పనులు ప్రారంభం అయిన కొద్ది రోజుల్లోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రావడంతో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టకుండా తాత్కాలిక రోడ్డు వేయడంతో కొద్దిపాటి వర్షానికే అది కొట్టుకుపోయిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్కడ బ్రిడ్జిలు నిర్మించాలని డిమాండ్ చేశారు.

Jangaon Chowrasta : బ్రిడ్జిలు నిర్మించాలని గాడిదపై మంత్రుల ఫొటోలతో నిరసన