హుస్నాబాద్, అక్టోబర్ 31: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మొంథా తుపాన్ ప్రభావంతో నష్టపోయిన దెబ్బతిన్న, జరిగిన ఆస్తి నష్టం, వర్షపునీటి పరిస్థితులను సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. సీఎం వెంట మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. హుస్నాబాద్ ప్రాంతంలో కురిసిన వర్షం, హుస్నాబాద్ మార్కెట్ యార్డులో తడిసిన ధా న్యం, వరద పరిస్థితులు, నష్టపోయిన పంటల వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎంకు వివరించారు.
నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో అత్యధికంగా 42సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకావడంతో తీవ్రనష్టం వాటిల్లిందని, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని సీఎంకు వివరించినట్లు స్థానిక నాయకులు తెలిపారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్, అక్కన్నపేట మండలం మోత్కులపల్లి సమీపంలో దంపతుల గల్లంతు, వివిధ ప్రాంతాల్లో తెగిపోయిన కల్వర్టులను సీఎం హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, సైదాపూర్ మండలాల్లో జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసి పంపాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం.