 
                                                            మెదక్ రూరల్, అక్టోబర్ 31: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు వారి చేత వెట్టి చాకిరి చేయిస్తున్న సంఘటన హవేలీ ఘనపూర్ మండలంలో వెలుగు చూసింది. శుక్రవారం మండల పరిధిలోని కూచన్‌పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులను గ్రామంలోని వాటర్ ప్లాంట్ నుండి పాఠశాలకు ద్విచక్ర వాహనంపై రెండు నీటి కేన్లను తీసుకువెళ్లడం చర్చనీయాశంగా మారింది. విద్యార్థులను పలువురు ఎక్కడికి నీళ్లు తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా, ఉపాధ్యాయులు తీసుకురమ్మన్నారు చెప్పడం గమనార్హం. మండల విద్యాధికారి కార్యాలయం ఉన్న పాఠశాలలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా పాఠశాలల పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులతో వెట్టి చాకిరి చేయించడం పట్ల పలువురు మండిపడ్డారు. విద్యార్థులతో పని చేయిస్తున్న ఉపాధ్యాయులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
 
                            