 
                                                            రాసంగం : సేంద్రియ పద్ధతిలో (Organic farming) పంటల సాగు చేయడం ద్వారానే భవిష్యత్తు తరాలకు సురక్షిత ఆహారం, పర్యావరణాన్ని రక్షించవచ్చని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఝా (Collector P. Praveenya Jha) అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బిడెకన్నె గ్రామ శివారు అరణ్య శాశ్వత వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె సందర్శించి సేంద్రీయ సాగు విధానంపై మహిళా రైతులను అడిగి తెలుసుకున్నారు.
ఐదు రోజులుగా ఆయా మండలాల మహిళా రైతులకు సేంద్రీయ సాగు విధానంపై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. సేంద్రియ సాగు విధానంలో పంటలను పండించడం వల్ల లాభాల గురించి అక్కడి మహిళా రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ విధానంలో సాగుచేసిన పంటలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు. తక్కువ పెట్టుబడితో పంటలను సాగు చేస్తున్నామన్నారు.
భవిష్యత్తు తరాలకు ఈ పంటలపై అవగాహన ఉండేవిధంగా చూస్తామని మహిళా రైతులు కలెక్టర్ కు హామీ ఇచ్చారు. అనంతరం శిక్షణ పొందిన మహిళా రైతులకు కలెక్టర్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి శివప్రసాద్, సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీదేవి, వ్యవసాయ అధికారి ప్రేమలత, జహీరాబాద్ ఆర్డీవో దేవుజా, సహాయ వ్యవసాయ సంచాలకులు బిక్షపతి, తహసీల్దార్ తిరుమలరావు, ఎంపీడీవో మంజుల, మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్, అరణ్య సీఈవో పద్మ, ఎల్ఎన్ఎఫ్ఐ నోడల్ ఆఫీసర్ స్నేహా, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.
 
                            