భీమదేవరపల్లి/అక్కన్నపేట, అక్టోబర్ 31: భర్తతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలు తల్లిగారింట్లో సంబురంగా చేసుకుందామనుకున్న ఆమె కలలు మొంథా తుపాను ప్రభావంతో కల్లలయ్యాయి. పుట్టిన రోజే ఆ దంపతులకు చివరిరోజుగా మారింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రాల్లో విషాదం నింపింది. స్థానికుల కథనం మేరకు.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రానికి చెందిన ఈసంపల్లి ప్రణయ్ (28), సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలకేంద్రానికి చెందిన మ్యాక కల్పన(24)తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈనెల 29న కల్పన పుట్టిన రోజు సందర్భంగా భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై భీమదేవరపల్లి నుంచి బుధవారం అక్కన్నపేటకు బయలుదేరారు. అదేరోజు మొంథా తుపాను కారణంగా అతి భారీ వర్షాలు కురిశాయి.
దీంతో కొత్తకొండ – మల్లారం రోడ్డు తెగడంతో ప్రణయ్ దంపతులు కొత్తకొండ-ధర్మారం మీదుగా అక్కన్నపేటకు బయలుదేరారు. మల్లంపల్లి దాటిన తరువాత మోత్కులపల్లి కల్వర్టు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగు దాటేందుకు ప్రయత్నించగా బైక్ సహా కొట్టుకుపోయారు. గురువారం పెద్దతండా గ్రామానికి చెందిన శుక్రునాయక్ వ్యవసాయ పనులకు వెళ్తుండగా ద్విచక్రవాహనాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు బైక్ నంబర్ ఆధారంగా భీమదేవరపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రణయ్గా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీం సభ్యులు గురువారం రాత్రి వరకు వాగులో గాలింపు చేపట్టారు. శుక్రవారం మల్లంపల్లి ఊరచెరువులో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. అక్కన్నపేట ఎస్సై చాతరాజు ప్రశాంత్ మృతదేహాలకు పంచనామా నిర్వహించి హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.