యాదాద్రి భువనగిరి, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : రైతులకు సకాలంలో యూరియా అందించాలంటూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. సోమవారం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారి వద్ద మండలం కమిటీ ఆధ్వర్యంలో బైఠాయించింది. ఖాళీ యూరియా బస్తాలలను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఎలాంటి ప్రేమ లేదన్నారు. కొత్తగా యాప్ తీసుకొచ్చి అవస్థల పాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట ఎదిగే సమయంలో పరిమితి విధించి ఆగం చేస్తుందన్నారు. యాసంగి పంటకు సకాలంలో యూరియా సరఫరా చేయకుండా యాప్ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల ద్రోహి అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, తుకాపురం సర్పంచ్ జనగాం పాండు, మండల ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్ గౌడ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జకా రాఘవేందర్ రెడ్డి, చందుపట్ల మాజీ సింగిల్ విండో చైర్మన్ భల్గూరి మధుసూదన్ రెడ్డి, సర్పంచులు పడాల వెంకటేశ్వర్లు, తోటకూరి శంకరయ్య, కంకల లలిత కిష్ట య్య, ర్యాకల సంతోష శ్రీనివాస్, నాగెళ్లి గిరిజ రమేశ్ గౌడ్, కొండూరి దానమ్మ సత్యనారాయణ గౌడ్, అబ్బగాని వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.