భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : రైతులకు రైతుభరోసా అందించకుండా రేవంత్‌రెడ్డి సర్కారు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నది. సీజన్ దాటిపోతున్నా వరి పంట ఈనే దశకు వచ్చినా నేటికీ రైతులకు పంట పెట్టుబడి సాయం అందనేలేదు. నిన్న మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అని చెప్పి జరుపులు పెట్టిన కాంగ్రెస్ సర్కారు ఎన్నికల ఫలితాలు వచ్చి పాలకులు పీఠాలు ఎక్కినా ఇచ్చినమాట ప్రకారం యాసంగి రైతుభరోసా ఇవ్వలేదు. ప్రతిసారి ఆశ చూపి మొండిచేయి చూపించడం కాంగ్రెస్‌కు అలవాటైపోయింది.
నాడు స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు ఠంఛన్‌గా పంటల ఆరంభంలోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ములు జమ అయ్యేవి. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయినా ఒక్క సీజన్‌కు కూడా సమయానికి రైతుభరోసా ఇయ్యలేక నీళ్లునములుతోంది. ఒకవైపు యూరియా కష్టాలు పెడుతూ.. మరోవైపు రైతులకు భరోసా ఇవ్వడంలో మీనమేషాలు లెక్కపెడుతున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు కాంగ్రెస్ సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో యాసంగి పంటకు గత ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధునే రైతుల ఖాతాల్లో వేసింది. తర్వాత నుంచి రెండెకరాలు, మూడెకరాలు అని వాయిదాల పద్ధతితో భరోసా సొమ్మును ఇచ్చిన హామీ కంటే తక్కువ ఇచ్చి చేతులు దులుపుకుంది. దీంతో రైతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వంపై కత్తులు దూస్తున్నారు. మరోవైపు నిరసనలు తెలుపుతున్నారు.
తగ్గించాలనే యోచన
అర్హుల జాబితా ఉన్నా సర్కారు చేస్తున్న ఆలస్యంపై రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండుసార్లు పంటల సర్వేను చేసి కొన్ని పొలాలకు ఇవ్వకుండా చేసింది. దీంతోపాటు పంటలు వేసి భూములను సర్వే చేసి అర్హులను గుర్తించి వారికి మాత్రమే ఎకరానికి రూ.15 వేలు అని చెప్పి చివరికి రూ.12 వేలు ఇస్తానని చెప్పి అదే కొనసాగిస్తుంది. అదీ ఇవ్వడంలో కొర్రీలు పెడుతూనే ఉన్నది. ఈ సీజన్లో కూడా మంత్రి తుమ్మల శాటిలైట్ సర్వే చేసి పంటను గుర్తించాక భరోసా వేస్తానని చెప్పినా చివరికి పూర్తి స్థాయిలో పంటలు వేయకపోవడంతో ఆ సర్వే మాటలకే పరిమితమైంది.
ఇప్పుడు డిజిటల్ సర్వే అని వలంటీర్లను పెట్టి సర్వే మొదలుపెట్టారు. వాస్తవంగా యాసంగి సీజన్లో నవంబర్, డిసెంబర్ నెలకల్లా రైతుభరోసా రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉండగా.. నేటికి జమకాకపోవడం సర్కారు అసమర్థత తప్ప వేరే చెప్పనక్కర్లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,80,121 మంది రైతులకు గాను.. రూ.320.65 కోట్లు రావాల్సి ఉండగా నేటి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో కూడా వ్యవసాయ శాఖ వద్ద సమాచారం లేకపోవడం కొసమెరుపు.
ఎన్నికల పేరు చెప్పి దాటవేత
ఎన్నికల పేరు చెప్పి కాంగ్రెస్ సర్కారు రైతుభరోసాపై దాటవేత ధోరణి అవలంబిస్తున్నది. గత సీజన్లో పంచాయతీ ఎన్నికలు రావడంతో వానకాలం భరోసా సొమ్ములు రైతుల ఖాతాల్లో జమచేశారు. తర్వాత యాసంగి భరోసా వేయడానికి సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఏదో ఒక కొర్రీ పెట్టి నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇతరచోట్ల వడ్డీకి తెచ్చుకుని సాగు చేసిన రైతులు, రైతుభరోసాపై ఆశలు పెట్టుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు యూరియా కష్టాలు.. మరోవైపు పంటల దిగుబడి రాక నానా ఇబ్బందులు పడ్డారు. అయినా రైతుల్ని ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. గత నెల 26కల్లా ఇస్తామన్న మంత్రి మాట నెరవేరనేలేదు.
ఇస్తారా.. ఇవ్వరా చెప్పండి..
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నమాట ప్రకారం రైతుభరోసా ఇవ్వాలి. పెట్టుబడి కోసం అప్పులు తెచ్చుకున్నాం. వరి ఈనే దశకు కూడా వచ్చింది. చేతిలో డబ్బులు కూడా లేవు. చాలా ఇబ్బందిగా ఉంది. పంట చేతికి వచ్చేసరికి చేతికి అందకుండా పోయేలా ఉంది. ఒకపక్క వర్షాలు కూడా వచ్చేలా ఉన్నాయి. అసలు రైతుభరోసా ఇస్తారా.. ఇవ్వరా ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
– పూసం వెంకటేశ్వర్లు, రైతు, బెండాలపాడు, చండ్రుగొండ మండలం
సీజన్ అయ్యాక ఇస్తే ఉపయోగం ఉండదు..
సీజన్ దాటిపోయాక రైతుభరోసా సొమ్ములు ఇచ్చినా ఉపయోగం ఉండదు. పంట ఉన్నప్పుడే సొమ్ములు వస్తే అవసరానికి సాయం చేసిన వారవుతారు. మాట ఇచ్చారు. మాట ప్రకారం ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు.
– రమణబోయిన శ్రీను, రైతు, బుచ్చన్నగూడెం, అన్నపురెడ్డిపల్లి మండలం
పైనుంచి ఆదేశాలు రాలేదు..
రైతుభరోసాపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. సమాచారం రాగానే రైతులకు తెలియజేస్తాం. మా వద్ద ఉన్న సమాచారాన్ని ప్రభుత్వానికి పంపించాం. ఎంతమంది రైతులున్నారు.. అనే లెక్క తీశాం. యాసంగి వరి పంట ప్రస్తుతం ఈనే దశలో ఉంది. ‘రైతుభరోసా’ తప్పకుండా వస్తుంది.
– వేల్పుల బాబూరావు, డీఏవో, భద్రాద్రి కొత్తగూడెం