గ్లాస్గో: వైకల్యం శరీరానికే తప్ప సాధించాలన్న తపనకు కాదని నిరూపిస్తూ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పారా అథ్లెట్లు అసాధారణ ప్రదర్శన చేస్తున్నారు. సాధారణ క్రీడాకారులకు ఏమాత్రం తీసిపోని విధంగా పతకాల మోత మోగిస్తున్నారు. స్ప్రింటర్లు దిలీప్ మహదు గావిత్, మొహమ్మద్ బాసిల్ పురుషుల 100 మీటర్ల టీ47 విభాగంలో స్వర్ణం, రజతంతో సత్తా చాటారు. బుధవారం అర్ధరాత్రి వర్షంతో తడిసిన ట్రాక్‌పై, ప్రతికూల పరిస్థితుల్లో జరిగిన ఫైనల్లో దిలీప్ గావిత్ తన పర్సనల్ బెస్ట్ టైమింగ్ 10.71 సెకండ్లతో గేమ్స్ రికార్డు సృష్టిస్తూ అగ్రస్థానం అందుకోగా.. బాసిల్ సీజన్ బెస్ట్ 10.83 సెకండ్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ అథ్లెట్ కెవిన్ శాంటోస్ 10.85 సెకండ్లతో కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు.
భారత ఒలింపిక్ హీరో, స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మెన్స్ జావెలిన్ త్రోలో ఫైనల్ చేరుకున్నాడు. రోహిత్ యాదవ్, యశ్వీర్ కూడా పతక పోరుకు అర్హత సాధించారు. గురువారం బలమైన గాలులు, ప్రతికూల వాతావరణం మధ్య సాగిన క్వాలిఫికేషన్ రౌండ్లో నీరజ్ తన రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను అత్యధికంగా 79.61 మీటర్ల దూరం విసిరాడు. ఫైనల్‌కు క్వాలిఫై అయిన 12 మందిలో ఐదో స్థానంలో నిలిచాడు. 18 డిగ్రీల చలి, బలమైన గాలులతో ఇబ్బందిపడటంతో ఆటోమేటిక్ ఫైనల్ క్వాలిఫయింగ్ మార్కు (84 మీటర్లు)ను ఏ ఒక్క అథ్లెట్ సాధించలేకపోయాడు. రోహిత్ (78.37మీ), యశ్వీర్ (78.36 మీ) వరుసగా 9, 10వ స్థానాలతో ఫైనల్లో అడుగు పెట్టారు. శుక్రవారం ఫైనల్ జరగనుంది.

మహిళల షాట్ పుట్లో భారత అథ్లెట్ మన్‌ప్రీత్ సింగ్ కొద్దిలో కాంస్య పతకం చేజార్చుకుంది. ఫైనల్లో ఆమె 17.49 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మార్టినా దేవి, స్టీపుల్‌ఛేజ్‌లో పారుల్ చౌదరికి నిరాశే ఎదురైంది. 86+ కేజీ విభాగం ఫైనల్లో మార్టినా 245 కిలోల (స్నాచ్ 105, జర్క్ 140) బరువెత్తి ఐదో స్థానంతో సరి పెట్టగా.. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో పారుల్ 9నిమిషాల 26.75 సెకండ్లతో ఐదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. ఇక, పురుషుల షాట్‌పుట్‌లో భారీ అంచనాలున్న తజిందర్‌పాల్ సింగ్ 20.27 మీటర్లతో ఐదో స్థానంలో నిలిచి నిరాశపరచగా.. సమర్దీప్ సింగ్ 20.03 మీటర్లతో ఏడో ప్లేస్‌తో సరిపెట్టాడు.
వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్ ఖాతాలో మరో రజతం చేరింది. పురుషుల +110 కేజీ కేటగిరీలో లవ్‌ప్రీత్ సింగ్ ఒక్క కిలో తేడాతో గోల్డ్ చేజార్చుకుని సిల్వర్ ఖాతాలో వేసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన పోటీలో అతను మొత్తంగా 388 కేజీలతో రెండో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ లిఫ్టర్ ఆండ్రూ డేవిడ్ (389 కేజీ) గోల్డ్ నెగ్గాడు. స్నాచ్‌లో అత్యధికంగా 176 కేజీలతో గేమ్స్ రికార్డు సృష్టించిన లవ్‌ప్రీత్ క్లీన్ అండ్ జర్క్ రెండో ప్రయత్నంలో 212 కిలోల బరువెత్తి చివరి వరకూ అగ్రస్థానంతో స్వర్ణ పతక రేసులోనే ఉన్నాడు. కానీ, ఆఖరి ప్రయత్నంలో 217 కిలోల బరువు ఎత్తడంలో విఫలమయ్యాడు. మరోవైపు స్నాచ్‌లో 166 కిలోలతో సరిపెట్టిన డేవిడ్ జర్క్ రెండో లిఫ్ట్‌లో 223 కిలోల బరువెత్తి గేమ్స్ రికార్డు సృష్టిం చాడు. తను ఒక్క కేజీ తేడాతో స్వర్ణం అందుకోగా.. లవ్‌ప్రీత్ రజతానికి పరిమితం అయ్యాడు. ఇంగ్లండ్‌కు చెందిన గ్రిఫిత్స్ (356 కేజీ) కాంస్యం గెలిచాడు.