మామిళ్లగూడెం, జూలై 30 : జిల్లాలో ఇటీవల చేపట్టిన ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాల్లో జరిగిన అవినీతి అవకతవకలపై విచారణ జరపాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధిత అభ్యర్థులతో కలిసి కలెక్టరేట్లో కలెక్టర్ దివాకర టీఎస్‌ను కలిసి సండ్ర, బీఆర్ఎస్ నాయకులు గురువారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలు చేపట్టిన అధికారులు అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు చెప్పిన వారికి, పైరవీకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను తుంగలో తొక్కి నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎక్కడ కూడా అభ్యర్థులకు ఇంటర్వ్యూలు చేయాలనే నిబంధన లేదని, కేవలం విద్యార్హతలు, మార్కుల ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా.. వాటికి విరుద్ధంగా నియామకాలు చేపట్టారని మండిపడ్డారు.
బీఈడీ, డీఈడీ వంటి విద్యార్హతలు ఉన్న వారిని పక్కన పెట్టి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు సిఫార్సు చేసిన వారిని నియమించారని, ఇది సరైన విధానం కాదన్నారు. తుది జాబితాకు ఎంపికైన అభ్యర్థుల విద్యార్హతలు, మార్కులు, సాధించిన ర్యాంకుతో పూర్తి వివరాలను అధికారికంగా వెంటనే వెల్లడించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నియామకాలను రద్దు చేసి, అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అన్యాయం జరిగిన అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళీప్రసాద్, నాయకులు బెల్లం వేణుగోపాల్, బిచ్చాల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.