ఏండ్ల తరవడి ఎంత ఉరుకులాడినా ఈ ఇరుకు బస్తీలల్ల మా బతుకులు ఇంకా కూరుకుపోతనే ఉన్నయి గనీ, పైకి లేస్తలెవ్. ఇన్లకెళ్లి మేం బయటవడేది లేదు, మా బతుకులు తెల్లవడేది లేదు. పొద్దున లేసిన్నుంచి మొదలు, పొద్దూకి నడుమాల్శేదాన్క మా బస్తీలల్ల వెదజల్లే మురుగు వాసనే మాకు స్వచ్ఛమైన గాలి. ఈ మురుగు వాసనకు అలవాటుపడ్డ మా ముక్కుదూలాలు, ఏ మటన్ వాసనను, ఏ కోడికూర వాసననూ పసిగడ్తలెవ్వు. వాసనతోనే కడుపు నింపుకొనే మాకు ఆఖరికి అదిగూడ కరువైంది. మా బస్తీనే ఇరుకంటే, అన్ల మా ఇళ్లు ఇంకా ఇరుకు. ఒక్క సింగిల్ బెడ్రూం ఇంట్ల ఎనమండుగురం కాలమెళ్లదీస్తున్నం.
‘డడ్డన్క డడ్డన్క డం టక టక టక టక, డడ్డన్క డడ్డన్క డం టక టక టక టక…’ అని మందుల సాయిలు మా ఇంటెన్క మాదిగి డప్పు కొడ్తనే ఉంటడు. డప్పు కొట్టుడు పట్టు తప్పొద్దని రికాం ఉన్నప్పుడల్లా గిట్ల కొడ్తనే ఉంటడు. ‘ఇప్పుడేమన్న కార్యముందానుల్లా.. శెయ్యిలన్ని వోంగ కొడ్తనే ఉన్నవ్ డప్పు?’ అని నేనడుగుతె ‘మాదిగి డప్పు మంచిగ కొడ్తనే కదా మనల్ని మందిల కలుపుకునేది’ అని నాకు జవాబిచ్చేటోడు. ఇంతకూ ఈ మందుల సాయిలు ఎవ్వలో ఎర్కేనా? ఇంకెవ్వలు నాకు తాళి గట్టిన నా పెనిమిటి. సంగారెడ్డి జిల్లా జోగిపేట్ దగ్గర ఉన్న తాలెల్మ మా సొంతూరు. ఇరువై గుంటల శెల్క మా ఉంది గనీ, ఉన్నా, అది లేని లెక్కే. దానికి పార్కం తక్కువ. బైట మోగాల్సిన నా పెనిమిటి మాదిగి డప్పు ఇంటికాన్నే ఎక్వ మోగేదీ. ఇంకేం జేస్తం, పల్లెటూరి మాదిగి డప్పు జూబ్లీహిల్స్ బతుకొచ్చింది. ఈడికొచ్చినంకనే మాకు ముగ్గురు ఆడివిల్లలు, ఒక్క కొడుకు వుట్టిండు. ఈ నల్గురు పిల్లల్ని వట్టుకొని ఉన్నదో, లేందో దిని ఎంజీనగర్ బస్తీ గుడిసెలల్ల బతుకులెళ్లదీసినం.
పక్కా యాదికి లేదు గనీ, పదిహేనేండ్ల కిందనుకుంటా.. పెద్ద బిడ్డకు లగ్గమైంది, శిన్న బిడ్డ లగ్గానికెదిగింది. నా కొడుకు, శిన్న బిడ్డ నాల్గో తరగతి పుస్తకాలు సదువుతున్నరు. ఎగిలివారంగ ఎనిమిది గొడ్తున్నది. ‘ఓసారి డప్పు దరువ్తేస్తనే కర్ణమ్మా’ అనుకుంటా గుడిసెలకెళ్లి బస్తీలకు వోయిండు సాయిలు.
‘డడ్డన్క డడ్డన్క డం టక టక టక టక’ అని రెండు మూడు సార్ల మోగిన డప్పు సప్పుడు ఇగినవడ్తలేదు. డప్పు మోత ఆగిందేందని ఇంట్లున్న నేను బైటికుర్కచ్చిన. సాయిలు సుట్టూ మంది జమైర్రు. ఆ మందిలకెల్లి వొయ్యి ‘ఏమైందుల్లా, ఏమైందుల్లా’ అని ఎంత విల్శినా ఉలుకు లేదు, పలుకు లేదు. ఆయన మీదవడి ఒగేడ్సుడు గాదు, ఎంతేడిస్తేం లాభం? పోయినోడికి నా ఏడ్పులినవడ్తయా? ఆ ఆటోటాక్ పాడుగాను నన్నూ, నా పిల్లల్ని ఏడగాకుంట జేసింది. నా కట్టం సీత కట్టం. ఇది పగోనికి గూడ రావొద్దు.
సాయిలు వోయినంక కొన్నొద్దులకు రెండో బిడ్డకు లగ్గం జేస్తే వాళ్లకూ ముగ్గురు పిల్లలైండ్రు. అల్లుడు సెంట్రింగ్ పన్జేసుకుంటడు. రెక్కాడితే గానీ కడుపు నిండని బతుకులు వాళ్లయి. ‘అమ్మా ఎంత కట్టం జేసినా కిరాయిలకు సాల్తలెవ్వు. మేం గూడ మీ ఇంట్లనే ఉంటమే..’ అని నోర్దెరిసి అడిగితే కన్న పేగు కాదంటదా? అందుకే అక్కున చేర్చుకున్న. వాళ్లు ఐదుగురు, మేం ముగ్గురం. ఈళ్లే నా జీవితం. శిన్నింట్ల ఎనమండుగురికి ఎట్ల మెసులొస్తదనే గదా మీ డౌటు?, ఏం జేస్తం, ఉన్నంతల్నే కాళ్లు సాపుకొంటున్నం. నేనో నాలుగైదు ఇండ్లల్ల పాశి పన్జేస్తా. ఇంటికో మూడు వేలిస్తరు. అన్నిండ్లళ్ల బాసన్లు తోమి, ఇల్లూడ్శి, తూడ్సేసరికే పొద్దు గడుస్తది. సల్దో, బొల్దో.. పన్జేసినకాన్నే ఇంత దిని ఇంటికొస్తా.
ఇంటికొచ్చుడే ఆల్శం, నడుము నేలకొర్గుతది. మా బస్తీలున్న మురుగు కాల్వలే నా మనుమలు, మనుమరాండ్లకు ఆట మైదానాలు. శిన్న బిడ్డకు, కొడుక్కు ఇంకా లగ్గం గాలె. బిడ్డకు చేయని పెండ్లి కొడుక్కు జేస్తే ఎట్లా? అందుకే బిడ్డకు పెండ్లి చేయాల్నని సంబంధాలు జూస్తున్నం. కనీ, అచ్చేటోళ్ల ఐశత్కు మేం దూగద్దా? కొన్నొద్దులు ఆల్శమైనా మంచిదేగని శెల్లెకు మంచి సంబంధం సూడాల్నని కొడుకు విజయ్ ఆరాటం. ఆడు గూడ సెంట్రింగ్ పనే జేస్తడు. ‘మన లెక్క శెల్లె బస్తీల బతుకొద్దె అమ్మా, శెల్లె బంగ్లాల బతుకాలె, ఆమె భవంతిల బతుకాలె’ అని ఊకే శెప్పవట్టిండు. కరెక్ట్ అప్పుడే పట్నంల ఎమ్మెల్యే ఎలచ్చన్లొచ్చినయి. ‘మాకంటే మాకెయ్యమ్మా ఓటు’ అని బుడ్డ బుడ్డ లీడర్లు బస్తీలకొస్తనే ఉన్నరు.
కాంగిరేస్ లీడర్లయితే రికాం లేరు. ఓ రోజు ‘జూబ్లీహిల్స్ల కాంగిరేస్ మీటింగుంది, నువ్వు తప్పకుండా రావాలె కర్ణమ్మా’ అన్జెప్పుకుంటా పచ్చనోటు శేతుల వెట్టిర్రు. పైసల్దీసుకున్న ఆడిదాన్ని మోసం జేస్తనా? పానం బోయినా శెయ్య. అందుకే, ఆ మీటింగ్కు వోయిన. నా లెక్క మస్తుమందే అచ్చిన్రు ఆ మీటింగ్కు. అమ్మో.. ఈ కాంగిరేసోళ్ల దగ్గర పైసలు బగ్గనే ఉన్నయని మన్సులనుకున్న. ఇంతల మీటింగ్ షురువైంది. టేజి మీదికెల్లి మైకు బగ్గనే మాట్లాడుతున్నది. మేమొస్తే ఆడోళ్లకు ఇంటికి ఇరువై ఐదు వందలిస్తమన్నరు, ఇంకేదో, ఇంకేదో బగ్గనే శెప్పవట్టిర్రు ముచ్చట్లు. అన్లకెల్లి నాకు మంచిగినవడ్డ ముచ్చటేందంటే.. ‘దళితబంధు కింద మనిషికి 12 లచ్చలిస్తం, అవి మళ్ల గట్టుడు లేదు’ అన్జెప్తే మంచిగనిపిచ్చింది. మీటింగుకొస్తనే ఐదు వందలు శేతిల వెట్టినోళ్లు, ఇంతమంది జనాల మజ్జ ఇచ్చిన మాటను తప్పుతరా? ఎహ్హె తప్పనే తప్పరు. నాకైతే తప్పరనే అనిపించింది.
కొడుకు, అల్లుడు ఇద్దరు సెంట్రింగ్ పనే జేస్తరు కావట్టి కాంగిరేస్ను గెల్పియ్యాలె. కాంగిరేస్ గెలిస్తే దళితబంధు కింద ఇద్దర్కి గల్పి 24 లచ్చలత్తయి. ఒగనికింద పన్జేసే బదులు, ఈ 24 లచ్చలతోని ఈళ్లిద్దరే దుక్నం పెట్టుకుంటే మస్తు పైసలొస్తయనే ఇకమతులు వడ్డ. అటు, నా అల్లుని జీవితం, ఇటు నా కొడుకు, బిడ్డల జీవితాలు బాగుపడ్తయని ఆశవడ్డ. అందుకే కాంగిరేస్కు ఓటేశ్న. మేం ఓటేస్తనే గదా కాంగిరేస్ సర్కారొచ్చింది? సర్కారొచ్చింది గనీ, వాళ్లిస్తనన్న 24 లచ్చలు మాత్రం ఇంకా రాలె. ఇరువై నాలుగు లచ్చలు గాదు కదా? 24 రూపాల్ గూడ రాలె. ఇంకా బిడ్డెకు లగ్గం గాలె, కొడుకూ అల్లుడు ఒగలి శేతికిందికి పనికివోతనే ఉన్నరు. ఈ కాంగిరేసోళ్లు మాత్రం మళ్లా బస్తీ బాట వట్టిన్రు. బస్తీలకొచ్చి, మాటలతోని గాలిల మేడలు గడ్తనే ఉన్నరు. ఇంకనా వీళ్ల మాటలు నమ్మేది, నా పానం బోయినా నమ్మ…
-గడ్డం సతీష్ ,99590 59041