ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు, పత్తి, మక్కలు తడిసి ముద్దయ్యాయి. జనగామ వ్యవసాయ మార్కెట్లో వడ్ల కుప్పల నుంచి వరద నీటిని తోడేస్తున్న రైతులు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 13: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు భారీ వర్షం కురిసింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో భారీ వర్షానికి వందలాది టన్నుల ధాన్యం కండ్ల ముందే కొట్టుకుపోయింది. సర్కారు సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం వరద పాలైంది. ఆరుగాలం కష్టించి కాపాడుకుంటూ చేతికొచ్చిన పంట నీటముగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
యాదాద్రి భువనగిరి 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వలిగొండ, రామన్నపేట, ఆత్మకూరు, మోత్కూరు, చౌటుప్పల్, అడ్డగూడూరు మండలాల్లో ధాన్యం తడిసింది. వలిగొండ మండలంలో మార్కెట్ యార్డుతోపాటు, గుర్నాథ్‌పల్లి, నాగారం, గోపరాజుపల్లి గ్రామాల్లో వడ్లు తడిసిపోయాయి. ఆత్మకూరు (ఎం) మండలం కూరెళ్ల, మోత్కూరు మండలం వ్యవసాయ మార్కెట్‌తోపాటు పాటిమల్ల, దాచారం, రామన్నపేట మండలం దుబ్బాక, మునింపంపుల, నిదానపల్లి, పల్లివాడ గ్రామాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. చౌటుప్పల్ మార్కెట్ యార్డు, గుండాల మండల కేంద్రంలో ఆరబోసిన ధాన్యం వరదపాలైంది. చౌటుప్పల్, మోత్కూరు మండలాల్లో వరి, పత్తి పంటలు నీటమునిగాయి. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులపై కప్పడానికి టార్పాలిన్లు అందుబాటులోలేక ధాన్యం తడవడంతో ఎమ్మెల్యేలతో ఒకటి రెండు చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి హంగామా చేశారు. ఆత్మకూరు (ఎం), వలిగొండ, గుండాల, మోత్కూరు మండలాల్లో ఇండ్లలోకి నీరు చేరాయి. చౌటుప్పల్ మండలం నక్కలగూడెంలో ఆరు వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి.
వరంగల్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వాగు లు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలంలో మున్నేరువాగు, గంగారం మండలంలో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డులో కల్లాలపై ఆరబోసిన మక్కలు తడిసిముద్దయ్యాయి. జనగామ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో అమ్మకానికి తెచ్చి ఆరబెట్టుకున్న 3వేలకు పైగా బస్తాల ధాన్యం తడిసిముద్దయింది. ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట నుంచి బాలన్నగూడెం, అబ్బాయిగూడెం వైపునకు వెళ్లే కాజ్వే భారీ వరదలకు కూలిపోయింది. వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులు తడిసిముద్దయ్యాయి. నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన మక్కలు తడిసిముద్దయ్యాయి.
భద్రాద్రి జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు పొంగి, చెరువులు అలుగులు పడి పరీవాహక ప్రాంతాల్లోకి రోడ్లపైన వరద నీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని శ్రీరాంనగర్ కాలనీలో గంధం యాకయ్య ఇంటిపై నిర్మాణంలో ఉన్న పిల్లర్‌పై పిడుగుపడింది. కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి 24 వేల క్యూసెక్కులు, తాలిపేరు నుంచి 21 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. మణుగూరులో కోడిపుంజుల వాగు, కట్టువాగులు పొంగి ప్రవహించాయి. వాగుమల్లారంలోని డబుల్బెడ్రూం కాలనీలోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కారు. రైల్వే గేటు సమీపంలో వరద ప్రవాహం ఎక్కువై రోడ్డుపైకి వరదనీరు చేరింది. కట్టుమల్లారంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
తిర్లాపురం వద్ద ప్రధాన రహదారిపై వరద ప్రవహించింది. శివలింగాపురంలో డ్రైనేజీ గోడ కూలింది. పగిడేరులో అలుగు పొంగడంతో శాంతినగర్‌లోకి వరదనీరు చేరింది. రామానుజవరం – పగిడేరు దారిలో వరద ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. సురక్షా బస్టాండ్‌లో ఉన్న కార్గో పార్సిల్ సర్వీస్ కార్యాలయంలోకి వరదనీరు చేరగా సిబ్బంది బకెట్లతో నీటిని బయటికి తోడారు. సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తికి ఆటంకం కలిగింది. దుమ్ముగూడెం మండలంలో 52.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. గంగోలుచెరువు అలుగు పారుతోంది. ఆరువేల ఎకరాల్లో వరి నేలకొరిగింది.
8 వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. చర్ల మండలంలో ఈతవాగు పొంగింది. గొంపల్లి, కొత్తపల్లి, లింగాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బూర్గంపహాడ్ మండలంలో 70 ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. దోమలవాగు పొంగి ప్రవహిస్తున్నది. సోంపల్లి – బూర్గంపహాడ్ ప్రధాన రహదారిపైకి వాగు ప్రవహిస్తోంది. అశ్వారావుపేట నియోజకవర్గంలో 108.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారంవారిగూడెం వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. అన్నపురెడ్డిపల్లిలో వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. వెంకమ్మచెరువులో అలుగు పారుతున్నది. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి, రాజుపేట కాలనీ మధ్య నడుమవాగు వంతెనపై నుంచి పొంగి ప్రవహిస్తున్నది.