జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం ఒక నియోజకవర్గ ఎన్నిక కాదు. తెలంగాణ రాష్ట్రంలో గత 22 నెలల కాంగ్రెస్ పాలనలో జరిగిన ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజలిచ్చే తీర్పుగా చూడాలి. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది. కానీ, 600 రోజులు దాటినా ఏ ఒక్క హామీ సంపూర్ణంగా అమలు కాలేదు. తక్షణమే అమలు చేస్తామని చెప్పిన హామీల సంగతి చెప్పనక్కర్లేదు.
అధికారంలోకి వచ్చిరాగానే కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల జీవితాల్లో చీకట్లు నింపింది. మూసీ ప్రక్షాళన, హైడ్రా పేరిట పేదల ఇండ్ల కూల్చివేత, ఫోర్త్ సిటీ, ఫార్మా సిటీ లాంటి పేర్లతో రైతుల భూములను బలవంతంగా సేకరించి వారి జీవితాలను కాంగ్రెస్ పాలకులు విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. యూనివర్సిటీ భూములను, ఉద్యోగుల కంచె గచ్చిబౌలి భూములను స్వాధీనం చేసుకుని తమ అనుయాయులకు అప్పగించి అయాచిత లబ్ధి పొందాలని చూస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని బీసీ సామాజిక వర్గాలను, ఇతరత్రా హామీల పేరిట రైతులను, ఉద్యోగులను, మహిళలను, నిరుద్యోగ యువతను, ఒక్క మాటలో చెప్పాలంటే సబ్బండ వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీసే ఎన్నికగా చూడాల్సిన సందర్భం ఇది. ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని నిగ్గదీసే ఎన్నికగా చూడాల్సిన తరుణమిది.
బీసీ సామాజికవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ, ఈ విషయమై గత కొంతకాలంగా జరుగుతున్న డ్రామా గురించి చెప్పనక్కరలేదు. ప్రజలకు, ప్రభుత్వానికి; ఉద్యోగులకు, ప్రభుత్వానికి; హైడ్రా బాధితులకు, ప్రభుత్వానికి; మహిళలకు, ప్రభుత్వానికి; మూసీ బాధితులకు, ప్రభుత్వానికి; హామీలు ఎగవేసిన కాంగ్రెస్ పార్టీకి, హామీలు అమలు చేయాలని ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికగా చూడాల్సిన సమయం ఆసన్నమైంది.
మరోవైపు తెలంగాణ హక్కులను కాలరాసే విధంగా గోదావరి, కృష్ణా నీటి పంపకాలపై కాంగ్రెస్, బీజేపీ అనుసరిస్తున్న వైఖరి వల్ల శాశ్వతంగా న్యాయమైన నీటి హక్కులను వదులుకునే ప్రమాదమున్నది. ఈ దుర్మార్గ కుట్రలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల మద్దతు ఉందని చెప్పాల్సిన అవసరం ఉన్నది. గత 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న నిర్బంధం ఎమర్జెన్సీ పాలనను తలపిస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పౌర సమాజంపై పెడుతున్న అక్రమ కేసులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. సమస్యలపై ఉద్యమిస్తున్న రాజకీయ పార్టీల నేతల నిర్బంధం సర్వసాధారణంగా మారిపోయింది. ఇచ్చిన హామీ ప్రకారం జీతాలు పెంచాలని డిమాండ్ చేసిన మహిళా ఉద్యోగులపై లాఠీచార్జ్ చేయడం, యూరియా కోసం రైతులు నిరసన వ్యక్తం చేస్తే నిర్బంధించడం, బస్సు చార్జీలు పెంచడం దుర్మార్గమంటే అక్రమ అరెస్టులు చేయడం, నిరసనలకు నాయకత్వం వహించే కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం, కమిషన్ల విచారణలు, అవినీతి లేని కేసుల్లో ఏసీబీ అధికారుల హంగామా, రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలనకు తోడుగా నిలుస్తున్న బీజేపీ, రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి వచ్చిన అవకాశంగా ప్రస్తుత జూబ్లీహిల్స్ ఎన్నికలను ప్రజలు చూడాల్సి ఉంది.
ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీపడిన విషయాన్ని గుర్తు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇటీవల బాకీ కార్డుల ఉద్యమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సర్కారు ఎగ్గొట్టిన హామీలను ఈ బాకీ కార్డుల ద్వారా బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నది. అయితే, బాకీ కార్డుల ద్వారా ముఖ్యమైన అంశాలను మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలను ప్రచారం చేయాలని ప్రజలు తెలంగాణ గ్యారేజ్‌కు వచ్చి మరీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బాకీ ఏ కొలమానంలో చెప్పాలో తెలియని స్థితి నెలకొన్నది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 10 లక్షల తులాల బాకీ, 65 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.76,000 రైతుబంధు బాకీ, 1.27 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఒక్కొక్కరికి రూ.55,000 బాకీ, 5,04,115 లక్షల మంది దివ్యాంగులకు ఒక్కొక్కరికి రూ.44 వేలు కాంగ్రెస్ సర్కారు బాకీ ఉంది. ఈ బాకీలన్నింటినీ వెంటనే చెల్లించాలని ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను గట్టిగా అడగాల్సిన ఉప ఎన్నిక ఇది.
రాష్ట్రంలో ఉన్న 7,23,115 మంది ఉద్యోగుల పరిస్థితి, 7,50,117 మంది కాంట్రాక్ట్,
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మరీ దారుణం గా ఉన్నాయి. ప్రతీ ఉద్యోగికి 18 శాతం కరువు భత్యం, 2023 జూలై నుంచి అమలు కావలసిన పీఆర్సీ, హెల్త్‌కార్డులు, రిటైర్డ్ ఉద్యోగులకు రూ.10,000 కోట్ల బకాయిలు, సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు రావలసిన రూ.5,000 కోట్ల బకాయిలు బాకీ ఉన్నది. . కేసీఆర్ పాలనలో 73 శాతం పీఆర్సీ, 5 శాతం మధ్యంతర భృతి ఇవ్వడం వల్ల తెలంగాణ ఉద్యోగుల జీతాలు మిగతా రాష్ర్టాల ఉద్యోగుల కంటే ఎక్కువగా ఉన్నయి. ఈ స్థితి నుంచి 5 విడతల కరువు భత్యం రాని దుస్థితికి దిగజారిపోవడంతో జీతాలు గణనీయంగా తగ్గిపోయాయి. దేశంలోనే 5 విడతల కరువు భత్యం బాకీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం విషాదం. రిటైర్డ్ ఉద్యోగులు మానసిక ఒత్తిడితో మరణిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ.26,000 ఇస్తామని చెప్పి మోసం చేయడమే కాకుండా, ఆరు నెలలుగా అనేక శాఖల్లో వేతనాలు లేవు.
నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రెండేండ్లలో కేవలం 10,000 ఉద్యోగాలు భర్తీ చేసి, గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా వచ్చిన ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకొని 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పారు. కేవలం ఆరు నెలల్లో 60 వేలు ఇచ్చామని చెప్పిన ప్రభుత్వం 22 నెలల్లో ఎన్ని ఇచ్చారని నిలదీస్తే జవాబు లేదు. తెలంగాణ ప్రజలకు మరో శత్రువు బీజేపీ. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. గత 12 ఏండ్లలో తెలంగాణ రాష్ర్టానికి రాజ్యాంగబద్ధంగా రావలసిన నిధులు కూడా ఇవ్వకుండా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్తూ తెలంగాణ ప్రజల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.
ఇటీవల జీఎస్టీ తగ్గించామని గొప్పలు చెప్తున్న కేంద్రం గతంలో వసూలు చేసిన పన్నుల గురించి నోరు మెదపడం లేదు. బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తూ కొందరిని ఈడీ, సీబీఐల పేర కేసులతో వేధిస్తున్నది. ప్రశ్నించిన పౌరులను అర్బన్ నక్సల్స్‌గా ముద్రవేసి అంతం చేసే ప్రయత్నం చేస్తున్నది.
మావోయిస్టులను 2026 మార్చికల్లా అంతం చేసి, మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని చెప్పి వేలాది మంది ఆదివాసీలను ఎన్కౌంటర్, అక్రమ కేసుల పేరిట హతమార్చే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఆదివాసీలు, గిరిజనులు, మావోయిస్టు పార్టీ లేవనెత్తుతున్న సమస్యలను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో చెప్పే సాహసం మాత్రం చేయడం లేదు. కేవలం ఆదివాసీల కాళ్ల కింద ఉన్న ఖనిజాలను బహుళజాతి సంస్థలకు అప్పజెప్పడానికి ఆపరేషన్ కగార్ చేయడం అన్యాయమని, చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం చూపాలని పౌరసమాజం చేస్తున్న డిమాండ్‌ను పట్టించుకోకపోవడం బాధాకరం. బాధ్యత గల రాజకీయ పార్టీ అధినేతగా కేసీఆర్ లక్షలాది మంది సమక్షంలో కగార్‌ను నిలిపివేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఆదివాసీలు, గిరిజనుల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బాధ్యతను తెలియజేసింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ద్వారా కేంద్ర, రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న రెండు పార్టీల అధికారానికి ముప్పు లేదు. అయినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు తొడపాశం పెట్టి ఓడించడం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేసే గొ ప్ప అవకాశం ఉంది. ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి మద్దతివ్వ డం ద్వారా వారికి బుద్ధిచెప్పే అవకాశం ఉంది. తెలంగాణ అస్తిత్వాన్ని హేళన చేస్తూ, అభివృద్ధిని విధ్వంసం చేసే శక్తుల పట్ల ప్రజలు ప్రళయరుద్రులవుతారనే సందేశాన్ని ఇవ్వవలసిన సామాజిక బాధ్య త అందరిపై ఉంది. ఏ ఎన్నిక అయినా ప్రజల పట్ల శత్రు వైఖరి అవలంబిస్తున్న పాలకులకు ప్రజాస్వా మ్య పద్ధతిలోనే జవాబు చెప్పడం ద్వారా కబడ్దార్ అనే సందేశాన్ని పంపడమే అసలైన ప్రజాగ్రహం.
– (వ్యాసకర్త: కార్పొరేషన్ మాజీ చైర్మన్) దేవీప్రసాద్