హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమస్యల పరిష్కారం కోసం కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. సర్కార్‌పై సమరశంఖం పూరించారు. సర్కార్ తీరును నిరసిస్తూ ఏప్రిల్ 8 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు ఇచ్చారు. ఏప్రిల్ 8న ఉదయం 10గంటల నుంచి సమ్మెలోకి వెళుతున్నట్టు ప్రకటించారు. మంగళవారం నాలుగు విద్యుత్తు సంస్థల సీఎండీలను కలిసి సమ్మె నోటీసులు అందజేశారు. రాష్ట్రంలోని 9 సంఘాలు తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి, ఈ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు పిలుపు ఇచ్చాయి. సమ్మెకు ముందే ఐదు చోట్ల భారీ ధర్నాలు నిర్వహించనున్నట్టు జేఏసీ నేతలు ప్రకటించారు.
మార్చి 26, 30న విద్యుత్తు సంస్థల ఆపరేషనల్ డివిజినల్ కార్యాలయాల ఎదుట ధర్నా, మధ్యాహ్న భోజన సమయంలో నిరసనలు, ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయాల ఎదుట వంటావార్పు, ఏప్రిల్ 4న పాల్వంచలోని కేటీపీఎస్ ప్లాంట్ ఎదుట జెన్కో ఉద్యోగులతో ధర్నా, ఏప్రిల్ 7న వరంగల్‌లోని ఉత్తర డిస్కమ్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహిస్తామని జేఏసీ చైర్మన్ ఎస్ సతీశ్‌రెడ్డి, కన్వీనర్లు ఎస్ సాయిలు, ఎస్ చంద్రారెడ్డి, కో చైర్మన్ శ్రీధర్‌గౌడ్, చందర్‌సింగ్ ఠాకూర్, నేతలు ప్రకటించారు. ఈ సమ్మె నోటీసు అందజేసిన కార్మిక సంఘాల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూటీకి చెందిన తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ కూడా ఉండటం గమనార్హం.