వికారాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : జిల్లా రైతాంగానికి ఎరువు కష్టాలు తప్పడం లేదు. సాగుకు చేదోడుగా ఉండి సకాలంలో ఎరువులను అందించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాప్‌ల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నా యి. మొదట పత్తి పంటను అమ్మేందుకు యాప్‌ను తేగా.. ఇప్పుడు రైతులు ఎరువులు కొనేందుకూ తీసుకొచ్చింది. వానకాలం జూన్‌లో మొదలైనా ఇప్పటివరకు రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచలేదు. పదిహేను రోజులకొక యూరియా బస్తాను అందిస్తున్న ప్రభు త్వం మళ్లీ కొత్త యాప్(ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్)ను తీసుకొచ్చి కష్టాల పాలు చేస్తున్నది. జిల్లాలో శుక్రవారం నుంచి ఆ యాప్ అందుబాటులోకి వచ్చిందని చెబుతున్నా ఎరువులు మాత్రం దొరకడంలేదని అన్నదాత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. కొత్త యాప్‌లో బుక్ చేస్తే నో స్టాక్, సర్వర్ సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
ఈ యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలం టే మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశముందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. కొత్త యాప్ రైతులకు కొత్త చిక్కులను తీసుకొచ్చింది. ఎఫ్ఎఫ్ఎస్(ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్) యాప్‌లో లాగిన్ అయ్యేందుకు రైతులు ఫార్మర్ రిజి స్ట్రీ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఆధారంగా లాగిన్ కావాలి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా రైతులకు ఎరువులు వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు చాలామంది వద్ద స్మార్ట్ఫోన్లు లేకపోవడంతోపాటు గ్రామాలు, తండాల్లో నెట్వర్క్ సమస్య లు తలెత్తుతున్న దృష్ట్యా ఎరువులు తీసుకోవడంలో కష్టాలు తప్పేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొత్త యాప్‌తో మరిన్ని అవస్థలు
జిల్లా రైతాంగాన్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు కొందరు విత్తనాలను నాటారు. గత వారం, పది రోజులుగా కురుస్తున్న వానలతో యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. వరి నాట్లు ప్రారంభం కావడంతోపాటు మొక్కజొన్న, పత్తికి యూరియా తప్పనిసరిగా వేయాల్సి ఉండడంతో అగచాట్లు పడుతున్నారు. జిల్లా కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నా.. వాస్తవానికి సరిపోను స్టాక్ లేకపోవడంతోనే రైతులు ఇబ్బంది పడుతున్నారు. యూరియా అందక రైతులు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు సరిపడా ఎరువులను సరఫరా చేయకపోవడంతో ఆందోళనలో ఉన్న రైతులకు తాజాగా తీసుకొచ్చిన కొత్త యాప్ మరిన్ని కష్టాలకు కారణమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో మొన్నటివరకు ఉన్న యాప్‌లో బుకింగ్ సమస్యలు, సాంకేతిక లోపాలతో గంటల తరబడి ఫోన్లను పట్టుకొని ఎదురుచూడాల్సి వచ్చేందని.. డిజిటల్ విధానం పేరుతో ఎరువుల పంపిణీకి తీసుకొచ్చిన యాప్‌లతో మరింత ఆలస్యమవుతుందన్న విమర్శలున్నాయి. పంటలకు సరైన సమయానికి యూరియా వేయకుంటే దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు పేర్కొంటున్నారు. జిల్లాకు 28,775 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ప్రస్తుతం సుమారు 2,000 మెట్రిక్ టన్ను లే అందుబాటులో ఉందని అధికారులు చెబుతు న్నారు. ఇప్పటికే కొంతమేర యూరియాను రైతులు కొనుగోలు చేశారని చెబుతున్నా.. 2-3 వేల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కొనుగోలు చేయలేరని తెలుస్తున్నది.
అరకొర నిల్వలు..
ఎరువుల నిల్వలు అరకొరగా ఉండటం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. డిమాండ్‌కు తగినట్టు నిల్వలు లేకపోవడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొందరు రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసినా సకాలంలో యూరియా అందడం లేదని వాపోతున్నారు. జిల్లా వ్యవసాయాధికారులు సరిపడా యూరియా స్టాక్ ఉం దని చెబుతున్నా.. జిల్లాలో ఎక్కడా యూరియా స్టాక్ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సరిపడా యూరియా ఉంటే రోజుల తరబడి యాప్‌లో నో స్టాక్ అంటూ ఎందుకు చూపుతున్నదని రైతులు అధికారులను నిలదీస్తున్నారు. మరోవైపు కొత్త యాప్‌లో బుకింగ్ చేసేందుకు యత్నిస్తున్నా నో స్టాక్ చూపుతు న్నదని రైతులు పేర్కొంటున్నారు. మొన్నటివరకు అందుబాటులో ఉన్న యాప్‌లో ఎకరాకు ఒక బస్తా మాత్రమే బుక్ కాగా, మరీ కొత్త యాప్ ద్వారా ఎన్ని బస్తాలు బుక్ అవుతాయో చూడాలి.