వర్షపు ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలంటూ ‘జలసిరి’ కార్యక్రమం ద్వారా చెబుతున్న ప్రభుత్వం..క్షేత్రస్థాయిలో ఆశించినంత రీతిలో కార్యాచరణ కనిపించడంలేదు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని, కరువు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టాలంటూ అధికారులు ప్రచారం చేస్తున్నా.. సింగీతం రిజర్వాయర్ నుంచి వరద వృథాగా పోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నర్వ శివారు ప్రాంతంలో ఉన్న రిటెయినింగ్ వాల్‌కు గండిపడి నీరు వృథాగా పోతుండడంపై ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు.
-నిజాంసాగర్, ఆగస్టు 7
నిజాంసాగర్ ఆయకట్టుకు అనుసంధానంగా మహ్మద్‌నగర్ మండలంలో 416,50 మీటర్ల సామర్థ్యంతో సింగీతం రిజర్వాయర్‌ను నిర్మించారు. రిజర్వాయర్‌లోకి గాంధారి, పెద్దగుట్ట ప్రాంతాల్లో వర్షం కురిస్తే వరద ఇందులోకే ప్రవహిస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్న తర్వాత వరద నీరు వృథాగా మంజీరాలోకి ప్రవహించకుండా నిజాంసాగర్ ఆయకట్టుకు విడుదల చేసేలా మూడు వరద గేట్లు, కుడి, ఎడమ కాలువలు నిర్మించారు. వీటి ద్వారా మహ్మద్‌నగర్, నర్వ, గున్కుల్, బూర్గుల్ గ్రామాల్లోని సుమారు 500 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించనున్నారు.
2024 లో విస్తారంగా వర్షాలు కురియడంతో సింగీతం రిజర్వాయర్‌కు వరద పోటెత్తింది. దీంతో వరద తాకిడికి నర్వ శివారు ప్రాంతంలో ఉన్న రిటెయినింగ్ వాల్‌కు గండిపడి కొట్టుకుపోయింది. దీంతో రూ.8 లక్షలతో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. గతేడాది కురిసిన వర్షాలకు తాత్కాలిక పనులు కొట్టుకుపోవడంతో రూ.8 లక్షలు నీటి పాలయ్యాయి. గతేడాది నుంచి రిటెయినింగ్ వాల్‌కు పడిన గండి అలాగే ఉండడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వరద నీరు అక్కడికి చేరుకొని వృథాగా పోతున్నది. గండిని పూడ్చడానికి శాశ్వత పనుల కోసం నీటి పారుదల శాఖాధికారులు ఏడాదిన్నర క్రితం రూ.1.73 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇంతవరకూ నిధులు మంజూరుకాలేదు. మరోమారు రూ.86 లక్షలతో ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ అనుమతులు రాలేదు.
రిజర్వాయర్ నిండకముందే నీటి విడుదల
నాలుగైదు రోజులుగా వర్షాలు కురియడంతో సింగీతం రిజర్వాయర్‌లోకి ఎగువప్రాంతం నుంచి 661 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్టు నీటి నిల్వ 416.05 మీటర్లకు చేరుకున్నది. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోకముందే మూడు వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో రిటెయినింగ్ వాల్ వద్ద పడిన గండి నుంచి వృథాగా నీరు ప్రవహిస్తూ రిజర్వాయర్ ఖాళీ అవుతున్నదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కండ్ల ముందు నుంచే సాగు నీరు వృథాగాపోతున్నా కాపాడుకోలేక పోతున్నామంటూ ఆందోళన చెందుతున్నారు. గండిని పూడ్చి ఉంటే ప్రస్తుతం వానాకాలం పంటలతో పాటు రెండో పంటకు కూడా సాగునీరు అందేదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా శాశ్వత పనులు చేపట్టి రైతుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతున్నారు.
నీరంతా ఖాళీ అవుతున్నది
సింగీతం రిజర్వాయర్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద వస్తున్నా చెరువులో నీరు ఖాళీ అవుతున్నది. నీటిని అడ్డుకునేందుకు ఇసుక బస్తాలతో గతేడాది పను లు చేపట్టినా పరిస్థితి మళ్లీ యధాతథంగా మారింది. కండ్ల ముందు నుంచి వరద వృథాగా పోవడం చూసి తట్టుకోలేక పోతు న్నాం. పంటలైనా గట్టెక్కుతాయా అనే భయం పట్టుకున్నది. ఇప్పటికైనా శాశ్వత పనులు చేపట్టి రైతులను ఆదుకోవాలి.
-పెంటబోయిన దుర్గయ్య, రైతు, నర్వ గ్రామం