సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : ఫుట్‌పాత్‌లను అక్రమిస్తే ఉపేక్షించేది లేదని, తొలగించిన తర్వాత కూడా మళ్లీ ఆక్రమిస్తే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన హెచ్చరించారు. ప్రతి శనివారం ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించడానికి వాక్ ఫ్రీ పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతినెలా ఒక శనివారాన్ని ప్రత్యేకంగా కేటాయించి కార్పొరేషన్ పరిధిలో పకాగా సేకరించాల్సిన అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని, గత మూడు వారాలుగా ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
శుక్రవారం మాదాపూర్ న్యాక్‌లోని సీఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ సృజన్ పలు అంశాలపై మాట్లాడారు. చెత్తను రోడ్లపై వేస్తే వ్యాపారులపై చర్యలు ఉంటాయని, ప్రతీ షాపు, తోపుడు బండి వద్ద తప్పనిసరిగా డస్ట్ బిన్ ఉండాలని కమిషనర్ ఆదేశించారు. ‘నో బిన్, నో ట్రేడ్’ నినాదంతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామన్నారు. పారిశుద్ధ్య పర్యవేక్షణ మెరుగ్గా ఉండేందుకు రెవెన్యూ శాఖ సహకారంతో ట్రేడ్ లైసెన్స్ బాధ్యతలను శానిటేషన్ విభాగానికి కేటాయించినట్లు తెలిపారు. ప్రాథమిక చెత్త సేకరణను బలోపేతం చేసేందుకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సుమారు 10,000 ఈ-వాహనాలను అందుబాటులోకి తేనున్న ట్లు తెలిపారు.
ప్రతీ 450-500 ఇళ్లకు ఒక వాహనాన్ని కేటాయించి, క్యూఆర్ కోడ్ల ద్వారా చెత్త సేకరణ, ట్రాన్స్ ఫర్ స్టేషన్ల వద్ద పర్యవేక్షణ పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేస్తున్నామని తెలిపారు. ప్రతీ 3 నెలలకోసారి వరర్ల హాజరును సమీక్షించి, ఎకువకాలం విధులకు రాని వారి స్థానంలో కొత్త ప్రతిపాదనలు తీసుకుంటారని, వీధుల శుభ్రతకు స్వీపింగ్ మెషీన్ల ట్రయల్స్ నడుస్తున్నాయన్నారు. గత నెల 28న వైశాలి నగర్ నాలాలో వ్యక్తి పడిపోయిన ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని కమిషనర్ తెలిపారు. ఆ ప్రాంతంలో ముం దే రోడ్లు బ్లాక్ చేసి ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు నిర్ధారించారని, ప్రమాదానికి గల అన్ని కోణాలనూపరిశీలిస్తున్నామనివెల్లడించారు.
యూనిసెఫ్ భాగస్వామ్యంతో చైల్డ్ ఫ్రెండ్లీ కార్పొరేషన్
పాలనలో సామాజిక దృక్పథాన్ని పెంచేందుకు ‘చైల్డ్ ఫ్రెండ్లీ కార్పొరేషన్’ పాలసీని రూపొందిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. దీనికి సంబంధించి యూనిసెఫ్ మార్గదర్శకత్వం, సహాయం తీసుకుంటున్నామని, త్వరలోనే దీనికి పూర్తిరూపం ఇస్తామని చెప్పారు. వార్డుల వారీగా ప్రత్యక్ష పర్యటనలు చేస్తూ స్థానిక నివాసితుల సమస్యలు, మౌలిక వసతుల అవసరాలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటున్నామని తెలిపారు. పౌరుల ఫిర్యాదులకు అధికారులు సమయానికి స్పందించాలని, ప్రభుత్వ వ్యవస్థల్లో జవాబుదారీతనం తేవడమే తమ ప్రధాన ఉద్దేశమని కమిషనర్ పునరుద్ఘాటించారు. గత కొన్ని నెలలుగా (ముఖ్యంగా జూన్, జూలై నుంచి) ఆహార భద్రతా తనిఖీలను ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లు, హోటళ్లు, బిలింకిట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్ ఫారమ్‌లలో హైజీన్ ఆధారంగా రేటింగ్ ఇస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.
రాబోయే 10 రోజుల్లో ..
వర్షాకాలం నేపథ్యంలో ఏర్పడిన గుంతలు, ప్యాచ్ వర్ పనులను రాబోయే 10 నుండి 15 రోజుల్లో యుద్ధప్రాతిపదికన చేపట్టనున్నట్లు కమిషనర్ సృజన తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి ప్రాధాన్యతా రోడ్ల జాబితా తీసుకున్నామని, వారం రోజుల్లోగా పెద్ద ఎత్తున రోడ్ల రీ-కార్పెటింగ్ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ట్రాఫిక్ సమస్య నివారణకు చేపడుతున్న కీలక ఫె్లైఓవర్లు, వంతెనల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వివరించారు. ట్రిపుల్ ఐటీ జంక్షన్ , ఖాజాగూడ జంక్షన్ వద్ద రూ. 200 నుంచి రూ. 600 కోట్ల వ్యయంతో జరిగే పనులు అతిపెద్దవి అని చెప్పారు. అమీన్పూర్ రోడ్డు, అంజయ్య నగర్ రోడ్డు విస్తరణ, కూకట్ పల్లి ఫాక్స్ సాగర్ వద్ద స్టీల్ బ్రిడ్జ్, మియాపూర్, ఆల్విన్ కాలనీ, ఐడీఎల్ లేక్ ఫె్లైఓవర్ల పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, నిర్మాణ సమయంలో వాహనదారులకు కొంత అసౌకర్యం కలిగినా భవిష్యత్తులో ట్రాఫిక్ చికులు తప్పుతాయని పేరొన్నారు.